- ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్‌తో సరిహద్దులు ఫిక్స్
- కమతాల సరిహద్దులను గుర్తించడానికి ఉపయోగం
- 400 రోవర్లు కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- మరిన్ని కొనుగోలు చేసి.. జనవరిలో పైలట్ ప్రాజెక్ట్ సర్వే మొదలుకు సన్నాహాలు
హైదరాబాద్, వెలుగు: భూముల గెట్టు పంచాయితీలకు, భూతగాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వ్యవసాయ భూముల సర్వేలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, ‘గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ (జీఎన్ఎస్ఎస్) ఆధారంగా పనిచేసే ‘రోవర్ల’ను రంగంలోకి దించుతున్నది. ఇప్పటికే 400 రోవర్లు కొనుగోలు చేయగా.. వచ్చే నెలలో మరిన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నది. ఆకాశంలోని శాటిలైట్ల నుంచి వచ్చే సిగ్నల్స్ ఆధారంగా భూమిపై పిన్ పాయింట్‌గా హద్దులను నిర్ణయిస్తూ సర్వే చేసి కచ్చితమైన సరిహద్దులను నిర్ధారించనుంది. ఇన్నాళ్లూ టేపులు, ఇనుప గొలుసులతో సాగిన సంప్రదాయ, లోపభూయిష్టమైన సర్వే పద్ధతులకు స్వస్తి పలికి, అత్యంత ఆధునికమైన ‘శాటిలైట్’ సాంకేతికతను తీసుకువస్తున్నది.
ఈ ‘గ్లోబల్ నావిగేషన్’ వ్యవస్థను వచ్చే జనవరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జనవరిలో మొదలుపెట్టి, దశలవారీగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూముల సర్వే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇందుకోసం అవసరమైన టెండర్ల ప్రక్రియ, అదనపు రోవర్ల కొనుగోలు, సిబ్బందికి శిక్షణ త్వరలో పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది.
కమతాల రక్షణకు డిజిటల్ కంచె
సాధారణంగా భూమి సర్వే అంటే టేపులు, చైన్లు పట్టుకుని ఎండలో కొలతలు వేయాలి. కానీ ఇందులో సిబ్బంది చేసే చిన్న పొరపాటు వల్లనో, ఉద్దేశపూర్వక తప్పుల వల్లనో రైతులు నష్టపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ నూతన విధానంలో అంతరిక్షంలోని ఉపగ్రహాలే కీలకం కానున్నాయి. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ టెక్నాలజీతో ఈ రోవర్లు అనుసంధానమై ఉంటాయి. ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను నేరుగా స్వీకరించి, భూమిపై ఈ యంత్రాలు పిన్-పాయింట్ చేస్తాయి. దీనివల్ల పొలం గట్టు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది అనే విషయంలో గందరగోళం ఉండదు. మనుషులు చేసే సర్వేలో అడుగుల తేడాలు రావచ్చేమో కానీ, ఉపగ్రహాధారిత సర్వేలో పొరపాట్లకు తావుండదని అధికారులు అంటున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత కమతాల సరిహద్దులను గుర్తించడంలో ఈ రోవర్లు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయని చెబుతున్నారు.
అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగినప్పుడు గానీ, లేదా కొత్తగా భూమి కొనుగోలు చేసినప్పుడు గానీ సరిహద్దు రాళ్లు పీకేశారనే గొడవలు ఉంటాయని.. అయితే రోవర్లతో చేసే సర్వే ద్వారా ప్రతి రైతు కమతం హద్దులను జియో-కోఆర్డినేట్స్ ద్వారా ఫిక్స్ చేస్తారన్నారు. ఒకసారి ఈ డేటా ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కిందంటే.. ఇక ఆ భూమికి డిజిటల్ ఫెన్సింగ్ వేసినట్లే. భవిష్యత్తులో హద్దు రాళ్లు మాయం చేసినా, కాలువలు తవ్వినా.. రోవర్ సాయంతో మళ్లీ పాత పాయింట్‌ను చిటికెలో గుర్తించి, ఎవరి భూమి ఎక్కడి వరకూ ఉందో నిరూపించవచ్చు అంటున్నారు.
గుట్టలు.. చెట్లు.. పొదల్లోనూ ఈజీగా సర్వే
దట్టమైన పొదలు, చెట్లు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో గతంలో చైన్ సర్వే చేయడం సర్వేయర్లకు కత్తిమీద సాములా ఉండేది. రోజుల తరబడి సమయం వృథా అయ్యేది, కొలతలు తప్పుల తడకగా ఉండేవి. కానీ ఈ రోవర్ల రాకతో ఆ కష్టాలన్నీ తీరనున్నాయి. చెట్లు, పుట్టలు అడ్డు ఉన్నా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా సర్వే సులువుగా సాగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మానవ ప్రమేయం తగ్గడం వల్ల అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, లంచాలకు తావుండదు.
ప్రభుత్వం వద్ద 400 రోవర్లు
రెవెన్యూ యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతతో పొలాల బాట పట్టనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అత్యంత ఖరీదైన, అధునాతనమైన 400 రోవర్లను ప్రభుత్వం కొనుగోలు చేసి సిద్ధం చేసింది. ఈ పరికరాలను ప్రస్తుతం జిల్లాల వారీగా సర్వే బృందాలకు అందుబాటులో ఉంచే ఏర్పాటు జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో వీటి పనితీరును పరిశీలించడంతో పాటు, సర్వే సిబ్బందికి దీని వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి.
కేవలం ఉన్నవాటితో సరిపెట్టుకోకుండా, సర్వేను రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 400 రోవర్లకు అదనంగా, మరో 400 రోవర్లను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మొత్తం 800 రోవర్లు క్షేత్రస్థాయిలో పనిచేయనున్నాయి. ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ సర్వే పనులు ఏకకాలంలో వేగంగా జరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రోవర్ల సంఖ్య పెరగడం వల్ల రైతులు సర్వే కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన అవసరం ఉండదు.

