బతుకమ్మ చీరల పైసలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం

బతుకమ్మ చీరల పైసలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం

2022 సంవత్సరానికి రూ. 83 కోట్లు పెండింగ్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: బతుకమ్మ చీరల పైసలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. బతుకమ్మ పండుగ పోయి రెండు నెలలవుతున్నా సిరిసిల్ల నేతన్నలకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చిన మ్యాక్స్ సంఘాల నాయకులు ఆగమవుతున్నారు. ఏటా తెలంగాణ ఆడబిడ్డలకు సర్కారు బతుకమ్మ చీరలను అందిస్తోంది. ఈ ఏడాది కోటి చీరలను 190 రంగుల్లో, 19 డిజైన్లలో ఉత్పత్తి చేశారు. బతుకమ్మ చీరలతోపాటు, రాజీవ్ విద్యామిషన్, క్రిస్మస్, రంజాన్ పండుగలకు సంబంధించిన వస్ర్తాలు కూడా సిరిసిల్లలోనే ఉత్పత్తి అవుతున్నాయి. వీటన్నింటికి సంబంధించి రెండు సంవత్సరాల బకాయిలు దాదాపు రూ. 200 కోట్లకు పైగా నేత కార్మికులకు అందాల్సి ఉంది. 

7 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి

బతుకమ్మ చీరల ఉత్పత్తికి చేనేత జౌళిశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్డర్ ఇచ్చింది. ఆగస్టు 15 డెడ్ లైన్ గా విధించింది.  చిన్నతరహా పరిశ్రమలు, మ్యాక్స్ సంఘాల ఆధ్వర్యంలో చీరలకు సంబంధించిన డిజైన్లు, నూలును దిగుమతి చేసుకుని ఏప్రిల్ 20 నుంచి బతుకమ్మ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టాయి. ఏడు కోట్ల మీటర్ల బట్టతో కోటి చీరలను ఉత్పత్తి చేశారు.136 చిన్నతరహా పరిశ్రమలు,136 మ్యాక్స్ సంఘాలు బతుకమ్మ చీరల ఉత్పత్తిలో భాగసామ్యం అయ్యాయి.  ఒక్కో మీటర్​కు ప్రభుత్వం రూ. 34.50 చెల్లిస్తోంది. 5 వేల మంది నేత కార్మికులు ఆరు నెలల శ్రమించి అనుకున్న సమయానికి బతుకమ్మ చీరలను ప్రభుత్వానికి అందించారు.

రూ. 200 కోట్లకు పైగా బకాయిలు  

సిరిసిల్ల నేత కార్మికులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి 2021, 2022 సంవత్సరాల బకాయిలు రూ. 200 కోట్లకుపైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి బతుకమ్మ చీరలకు సంబంధించి రూ. 9 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కు సంబంధించి రూ. కోటి, 2022 సంవత్సరం బతుకమ్మ చీరల బకాయిలు రూ. 83 కోట్లు, రంజాన్ పండుగకు ముస్లింలకు ఇచ్చిన కానుకల బకాయిలు రూ. రెండు కోట్లు, భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఇచ్చిన జాతీయ జెండాల ఆర్డర్ కు రూ. 8 కోట్లు, కేసీఆర్ కిట్ కు రూ. 6 కోట్లు, క్రిస్మస్ కానుకలకు సంబంధించి రూ. 6 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు రాజీవ్ విద్యా మిషన్ కింద స్టూడెంట్ల కోసం తయారు చేసిన యూనిఫాంలు, ఇతర బకాయిలు కలిపి దాదాపు రూ. 200 కోట్లకు పైగా పెండింగ్​ఉన్నాయి. మరోవైపు నేత కార్మికులు కొనుగోలు చేసే బట్టపై కేంద్రం మొదట్లో 12 శాతం జీఎస్టీ విధించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు శాతం, కేంద్ర ప్రభుత్వానికి ఆరు శాతం చెల్లిస్తున్నారు. హ్యాండ్లూమ్ పై చెల్లించిన 6 శాతం జీఎస్టీలో ఒక శాతం కేంద్రం చేనేత కార్మికులకు వెనక్కు ఇస్తోంది. పాలిస్టర్ బట్టపై ఈ వెసులుబాటు లేదు. కేంద్రం ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వన్ పర్సెంట్ వెనక్కి ఇవ్వడం లేదు.