అంతరించిపోతున్న వలస జాతులు

అంతరించిపోతున్న వలస జాతులు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస జాతుల్లో ఇరవై శాతం మేర  కనుమరుగైపోయే దశలో ఉన్నాయి. 44 శాతం వలస జాతుల సంఖ్య క్షీణిస్తోందన్న కఠోర వాస్తవం ఐఎన్ఓ నివేదికలో బయటపడింది.  మహా సముద్రాల్లో 97 శాతం వలస జాతుల చేపలు క్షీణించే దశలో ఉన్నాయి. ఇలాంటి అంశాలతో కూడిన ఒక నివేదికను ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. దాదాపు పన్నెండు వందల జాతుల్లో అయిదో వంతు కన్నా ఎక్కువగా అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలిపింది.  నివేదిక ప్రకారం చూస్తే ప్రతి అయిదు వలస జాతుల్లో ఒకటి కచ్చితంగా అంతరించే ప్రమాదం ఉంది. 

ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ఉన్న 1200 వలస జాతుల్లో అయిదు శాతం కన్నా ఎక్కువ జాతులు కనుమరుగై పోతున్నాయి. మహా సముద్రాల్లో మత్స్యజాతి మరింత ఎక్కువగా అంతరించిపోనుంది. వలస జాతులకు చెందిన 97 శాతం చేపలు క్షీణ దశలో ఉన్నాయి. అదేవిధంగా వలస జాతుల పరిరక్షణ జాబితాలో లేని 399 జీవ జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి. 

పక్షులు, సముద్ర తాబేళ్లు, తిమింగలాలు, షార్కులు మరికొన్ని వలస జాతికి చెందిన జంతువులు తమ ఆహారం కోసం కాలానుగుణంగా తమ నివాస ప్రాంతం నుంచి వలసలు వెళ్తాయి.  అదే సమయంలో వేటగాళ్ల  కారణంగా కొన్ని జంతువులు బలై పోతుంటాయి.  మరోవైపు మారిన వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక మరి కొన్ని కాలుష్య కోరల్లో చిక్కుకుని మరణిస్తాయి.

వలస జాతుల ఆవాసాలు విచ్ఛినం

తూర్పు ఆసియా, ఐరోపా, భారత్, ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికాలో ఆనకట్టల ఫలితంగా వలస జాతి ప్రాణుల ఆవాసాలు విచ్ఛిన్నం అవుతున్నాయి.  కొన్ని జీవజాతుల జీవన విధానంలో వలస వెళ్ళడం తప్పనిసరి ప్రక్రియ.  ప్రకృతి పరంగా జంతువులు సంతానం, ఆహారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం సహజం. వాటికి మార్గమధ్యంలో తాత్కాలిక నివాసాలు అవసరమని ఐఎన్ఓకు నివేదించిన  కెల్లీ మల్ష్ తెలిపారు. 

వలసలు మానవుల కారణంగానూ, వాతావరణ మార్పుల వల్లనూ నిలిచిపోతే ఆ వలస ప్రాణులను మృత్యువులోకి నెట్టినట్టే అవుతుందన్నది పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం.  ఈ ఏడాది ప్రథమార్థంలో వింటర్ బర్డింగ్ ఫెస్టివల్ సందర్భంగా ' 7 వేవ్స్ ' పరిశోధనా బృందం ఒక సర్వే నిర్వహించింది.  గౌహతిలోని పమోహి,  టెటేలియా - బొరగావ్, వాచ్ టవర్ - డిపోర్ బీల్ వంటి ఏడు వేర్వేరు  ప్రదేశాల్లో వలస పక్షుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని సర్వే పేర్కొంది.  గత ఏడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 17 వరకూ చేపట్టిన సర్వేలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పక్షుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

వలస జాతులు ఉమ్మడి సంపద

పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వలస పక్షులు కీలక పాత్ర పోషిస్తాయి.  ఈ ఏడాది పదకొండు వేల పక్షుల తగ్గుదల కనిపించిందని,  వాటర్ ఫౌల్స్,  షోర్ బర్డ్స్,  వాగ్ టెయిల్స్,  పిపిట్స్, మార్టిన్, స్వాలోస్ వంటి జాతులు వలస వెళ్తుంటాయి. 'బైమాక్యులేట్ డక్'  అని కూడా పిలుచుకునే  'బైకాల్ టీల్' చాలా అరుదైన వలసజాతికి చెందినవి.  కాగా,   గత ఏడాది ఇది రెండుసార్లు కనిపించినా ఈ ఏడాది ఇప్పటివరకూ కనిపించలేదని పక్షి శాస్త్రవేత్త ప్రాంజల్ మహానంద తెలిపారు.  

వేగవంతమైన పట్టణీకరణ, అటవీ నిర్మూలన ప్రధాన కారణాలని చెబుతూ వాచ్ టవర్​లో  పక్షుల సంఖ్య అత్యల్పంగా నమోదైందని అన్నారు.  పక్షులు, గబ్బిలాలు, కీటకాల వలస కారణంగా మొక్కల్లో పరాగ సంపర్కం,  విత్తన వ్యాప్తి చోటుచేసుకుంటాయి.  వలస జీవజాతులు పర్యావరణ పర్యాటకానికి ఆకర్షణగా నిలుస్తాయి.  వాస్తవానికి వలస జాతులు ఉమ్మడి సహజ  సంపదకు  తార్కాణం.  వాటి సంరక్షణకు దేశాలన్నీ ఐక్యంగా పాటుపడాలి.  జీవ వైవిధ్యం ప్రాధాన్యత మీద ప్రజల్లో అవగాహన కలిగించాలి. వలస ప్రదేశాలను గుర్తించాలి. వాటితోపాటు ఆ ప్రాంతాలను రక్షితమైనవిగా ప్రకటించాలి.  పాలకులు చిత్తశుద్దితో వ్యవహరిస్తేనే  మనుగడ సాఫీగా సాగే అవకాశం వలస జీవ జాతులకు ఉంటుంది. 

జి.యోగేశ్వర రావు,
సీనియర్​ జర్నలిస్టు