తెలంగాణ సిరి- అందెశ్రీ

తెలంగాణ సిరి- అందెశ్రీ

తెలంగాణ గడ్డపై  జాతిరత్నాలై  వెలుగొందేవారిలో అందెశ్రీ  ఒకరు.  ఎందరికో ఆదర్శం.. ఆచరణీయం ఆయన ప్రస్థానం.  గొప్ప కవిగా,  గేయ రచయితగా, వక్తగా రాణించిన తెలుగుతేజం. జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.  వారి రచన తెలంగాణ ప్రజల ఆర్తి.  తెలంగాణ ప్రజల హృదయ స్పందనగా రాష్ట్రగీతమై విరాజిల్లుతున్న నేటి తరుణంలో వారి అకాల మరణం వ్యధ వర్ణనాతీతం.

 నిక్కచ్చిగా, నిర్భయంగా, యధార్థవాదిగా మాటలను తూటాలుగా పేల్చగల దిట్ట.  ఆయన జీవితం మన ఆశయ తెలంగాణకు అంకితం.  ఉద్యమాలకు తాను ఊపిరులై నిలిచిన గొంతుక.  తెలంగాణ ప్రజల దీపిక అందె ఎల్లయ్యయే అందెశ్రీగా వెలిగిన నవ్య తెలంగాణ ఆశుకవితా పితామహుడు.  వేదికలపైన ఎంతటి గొప్పవారున్నా సరే తనదైన శైలిలో తడబడకుండా తన మనసులోని మాట ఆశువుగాను గాంభీర్యంగా రాజీపడని తత్వంతో ముక్కుసూటి భావజాలాన్ని వ్యక్తపరచడమనేది ఆయన నైజం.

ఆయన ఆవేశం,  భావోద్వేగం అంతాకూడా కోరుకున్న తెలగాణభివృద్దికై గళమై, జనగర్జనై పాడింది.  ఆటై ఆడింది అందరినీ ఏకం జేసింది. సబ్బండ జాతుల చిరకాల వాంఛలు నెరవేరటంలో అందెశ్రీ పాత్ర చిరస్మరణీయం.  పశువుల కాపరి నుంచి  ప్రఖ్యాతిగాంచిన పండితులు  అందరిచేత మెప్పులనందుకున్న సహజ పండితుడు అందెశ్రీ.  హృదయాంతరాల నుంచి ఆవిష్కరిస్తున్న సామాజిక స్పృహలు ఆలోచనలు ఆవేదనలు వింటున్న ప్రతి ఒక్కరికి చైతన్య దీపికగా నిలిచారు. 

 ప్రకృతితో మమేకమైన సాధారణ జీవనశైలి, యాస, భాష ఒక యశోభూషణమై తరతరాల స్ఫూర్తిగా తెలంగాణ చరితమై  నిలుస్తుందనటంలో సందేహం లేదు.  అవమానాలకు ఎదురొడ్డి పోరాడిన యోధుడు.  సింహస్వప్నమై గర్జించిన ధీశాలి.  పెద్దగా బడిచదువులు లేని మేధావి.  బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక,  ఆత్మాభిమాన గొంతుక అందెశ్రీ.

- బస్వోజు లక్ష్మణాచారి