కామారెడ్డి, వెలుగు : విద్యార్థులు క్రమశిక్షణతోపాటు సేవాభావంతో మెలగాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఈయర్కు చెందిన వంద మంది స్టూడెంట్ల కోసం ‘వైట్ కోట్ సెరిమనీ’ ‘కడవెరిక్ ఓత్’ కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, నూతన స్టూడెంట్లకు వైట్ కోట్లను అందజేశారు. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. వాల్య (ఎంఎస్), వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎం.వీ కుమారి, హీరమాన్ (అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్), లెక్చరర్లు, సిబ్బంది, స్టూడెంట్లు పాల్గొన్నారు.
ధాన్యాన్ని మిల్లులకు తరలించండి..
సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం నర్సంపల్లి గ్రామ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని ఆరా తీశారు. తేమశాతం చెక్ చేయాలని, ప్రతిరోజూ సంబంధిత ఆఫీసర్లు, మండల ఆఫీసర్లు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే టాబ్లో ఎంట్రీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులు పూర్తి చేయండి..
జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి లో ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్ నిర్మాణ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం మెడికల్ కాలేజీకి వెళ్లి ప్రధాన కళాశాల భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను పరిశీలించారు. మిషన్భగీరథతో తాగునీటిని సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, ఆర్అండ్బీ ఈఈ మోహన్, మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ తదితరులు ఉన్నారు.
