హైదరాబాద్ సిటీలో బండ్లగూడ జాగీర్ తెలుసుగా.. ఈ విల్లాలో దొంగలు పడ్డారు !

హైదరాబాద్ సిటీలో బండ్లగూడ జాగీర్ తెలుసుగా.. ఈ విల్లాలో దొంగలు పడ్డారు !

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని ఓం నగర్ కాలనీలోని SM ఎంక్లేవ్ గ్రేటర్ కమిటీ గ్రేటర్ విల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి మూడు ఇళ్లల్లో చోరీ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కిరణ్ కుమార్ గౌడ్ ఇంట్లో 32 తులాల బంగారం దొంగలు ఎత్తుకుపోయారు. కిరణ్‌కుమార్‌గౌడ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లోని అందరూ నిద్రపోయారు. తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో దొంగలు చొరబడ్డారు. కిచెన్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి చొరబడ్డారు. కబోర్డ్‌లో దాచి ఉంచిన 32 తులాల బంగారు ఆభరణాలను తీసుకోని పారిపోయారు. 

దొంగతనం జరిగే సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నారు. అలాగే ఎన్‌క్లేవ్‌లోని మరో రెండు ఇళ్లల్లో కూడా డోర్‌ తాళాలను పగులగొట్టి ఇంట్లోకి చోరబడ్డారు. ఇంట్లో విలువైన సామాగ్రి లేకపోవడంతో డోర్‌లు, కబోర్డులను ధ్వంసం చేయడంతో పాటు సామాన్లను చిందరవందర పడేసి వెళ్లిపోయారు. బాధితులు ఉదయం నిద్ర లేని చూడగా దొంగతనం జరిగినట్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకోని క్లూస్‌ టీమ్‌తో ఆధారాలను సేకరించారు. దొంగతనం జరిగే సమయంలో సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేశారు.