బెంగుళూర్: ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ విడుదలకు బీసీసీఐ విధించిన డెడ్ లైన్ (నవంబర్ 15) సమీపిస్తుండటంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కసరత్తు ముమ్మురం చేసింది. వచ్చే సీజన్ కోసం ఏ ఆటగాడిని జట్టులో కొనసాగించాలి.. ఎవరిని వదిలేయాలనే దానిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఐదుగురు ఆటగాళ్లను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంచనాల మేర రాణించకపోవడం, ఇతర కారణాలతో ఈ ఐదుగురు ప్లేయర్లను వేలానికి వదిలేసేందుకు ఆర్సీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరీ ఆర్సీబీ విడుదల చేయనున్న ఆ ఐదుగురు ఆటగాళ్లేవరో తెలుసుకుందాం.
యష్ దయాళ్:
జట్టులో కీలక పేస్ బౌలరైన యష్ దయాల్‌ను ఆర్సీబీ వదిలేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. వేలంలో దయాల్‌ను రూ.5 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దయాల్ నిలబెట్టుకున్నాడు. తన ప్రదర్శనతో ఆర్సీబీకి కొన్ని మ్యాచుల్లో విజయాలు అందించాడు. యశ్ దయాల్ ప్రదర్శనపై సంతృప్తిగానే ఉన్న ఆర్సీబీ.. ఇటీవల అతడిపై కేసులు నమోదు కావడంతో గుడ్ బై చెప్పాలని సమాచారం.
లియామ్ లివింగ్‌స్టోన్:
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను వేలంలో రూ. 8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. కానీ వెచ్చించిన ధరకు న్యాయం చేయడంలో లివింగ్‌స్టోన్ విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఫెయిల్ కావడంతో లివింగ్ స్టోన్‌ను వేలానికి ముందే విడుదల చేసే అవకాశం ఉంది.
లుంగి ఎంగిడి:
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లుంగీ ఎన్గిడి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి విడుదలయ్యే చాన్స్ ఉంది. గత వేలంలో కోటి రూపాయలకు ఎంగిడిని కొనుగోలు చేసింది ఆర్సీబీ. కానీ జట్టు కూర్పులో భాగంగా అతడికి ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం రాలేదు. గత సీజన్లో ఎంగిడి కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
స్వప్నిల్ సింగ్:
ఇండియన్ స్పి్న్నర్ స్వప్నిల్ సింగ్‌ను కూడా ఆర్సీబీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.30 లక్షలకు సప్నిల్ సింగ్‌ను ఆర్సీబీ కొనుగోలు చేయగా.. 2025 సీజన్ లో అతడికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. సీజన్ మొత్తం ఈ స్పి్న్నర్ బెంచ్ కే పరిమితమయ్యాడు.
రసిఖ్ దార్:
యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ రసిఖ్ దార్ కూడా ఆర్సీబీ నుంచి విడుదల కావొచ్చు. గత సీజన్ లో ఆర్సీబీ తరుఫున రెండు మ్యాచులు ఆడిన యంగ్ బౌలర్ ఆశించిన మేర రాణించలేదు. రెండు మ్యాచుల్లో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి నిరాశపర్చాడు. దీంతో వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ అతడిని కొనసాగించకపోవచ్చు.
