నితీశ్ శకం సాగేనా.. ముగిసేనా?

నితీశ్ శకం సాగేనా.. ముగిసేనా?

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ నితీశ్​కుమార్​ నాయకత్వంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాబోతుందని చెపుతున్నాయి. అవి ఏమేరకు నిజం కాబోతున్నాయో రేపు (14వ తేదీ)  తెలిసిపోనున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,  నితీశ్​కుమార్​ బిహార్​ రాష్ట్రాన్ని అప్రతిహతంగా (మధ్యలో తానే నియమించిన జీతన్​ రామ్​ మాంజీ కొద్ది నెలల పాటు సీఎంగా ఉండడం తప్ప)  పాలిస్తూ 20 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి జాబితాలోకి ఇపుడు నితీశ్​కుమార్​ కూడా చేరిపోయారు. 

ఒకప్పుడు లాలూ, నితీశ్​ రాజకీయాల్లో మంచి మిత్రులు. 1990 నుంచి 95 వరకూ  

వీళ్లిద్దరి కాంబినేషన్​కు బిహార్​లో తిరుగులేదు. 15 ఏండ్ల  ​లాలూ యాదవ్​ పాలన తీరువల్ల .. బిహార్​లో ప్రత్యామ్నాయ నాయకుడిగా నితీశ్​కుమార్​కు కలిసొచ్చింది. నితీశ్ ఈ స్థాయికి ఎదిగిరావడంలో ఆయన ​ రాజకీయ గురువుగా జార్జ్​ ఫెర్నాండెజ్​ పాత్ర కాదనలేనిది.  నిజానికి గత 35 ఏండ్లుగా లాలూ వర్సెస్​ బీజేపీలే ప్రధాన ప్రత్యర్దులుగా నడుస్తూ వస్తున్నాయి. అందులో ఎవరు అధికారం చేపట్టాలన్నా నితీశ్​కుమార్​ సహకారం అనివార్యమవుతోంది. నితీశ్​కుమార్ పొలిటికల్​​ క్యారెక్టర్​ అందరికీ ఆమోద యోగ్యమే అని గడిచిన 40 ఏండ్ల బిహార్​  రాజకీయ చరిత్ర చెపుతోంది.

పల్టూరామ్​!

నితీశ్​కుమార్​ 20 ఏండ్లలో 4సార్లు కూటములు మార్చాడు.  ఏ కూటమిలో చేరినా ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. అదే​ నితీశ్​ పొలిటికల్​ సక్సెస్​ అనొచ్చు. అదే సమయంలో చాలామంది ఆయనకో ‘నిక్​ నేమ్’​ కూడా ఇచ్చారు ‘పల్టూరామ్​’ అని! బిహార్​లో అనేక సార్లు కూటమి మార్చిన నితీశ్​కుమార్​ను ప్రజలు పెద్దగా తప్పు పట్టలేదనే చెప్పాలి.  అందుకు కారణం లేకపోలేదు. 

నితీశ్​ పొలిటికల్​ కెరీర్​లో పెద్దగా మరకలు లేవు. కుటుంబాన్ని  రాజకీయాల్లోకి తేలేదు.  మిగతా నాయకుల కంటే ఆయనలో కాస్త నిజాయితీ ఎక్కవ అనే  అక్కడి  ప్రజల నమ్మకమే  ఆయన్ను  సుదీర్ఘ కాలం బిహార్​కు ముఖ్యమంత్రిగా కొనసాగించిందని చెప్పాలి.  సోషల్​ ఈక్వేషన్​ వల్ల బీజేపీ కూడా ఆయన్ను ముఖ్యమంత్రిగా కొనసాగించిదనే చెప్పొచ్చు. 

యాదవేతర ఓబీసీలను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీకి నితీశ్​ కుమార్​ నాయకత్వం బాగా తోడ్పడింది కూడా!  అలాగే,  మహా దళిత్​లు, ఈబీసీలు కూడా బీజేపీకి  చేరువ కావడానికి నితీశ్​ కుమార్ నాయకత్వం తోడ్పడింది. బిహార్​లో ఎంతగా కుల రాజకీయాలు ఉన్నా.. ముఖ్యమంత్రి క్యారెక్టర్ కు ​ కూడా అక్కడి ప్రజలు ప్రాధాన్యత ఇస్తారనడానికి నితీశ్​ పొలిటికల్​ కెరీరే  అందుకు సాక్ష్యం!

అందరి ఆమోదనీయతే నితీశ్​ సక్సెస్​!

పల్టూరామ్​గా ఆయనను  ప్రతిపక్షాలు ఎంతగా నిందించినా..బిహార్​ రాజకీయ సమీకరణలు ఆయనకు అన్ని పార్టీలలో ఆమోదనీయతను తెచ్చిపెట్టింది. ప్రధాన పార్టీలైన ఆర్​జేడీ, బీజేపీలలో ఎవరు అధికారంలోకి రావాలన్నా మూడోపార్టీగా జనతాదళ్​ (యూ) చీఫ్​ నితీశ్​ కుమార్​ ఒక అనివార్య నేతగా మారాడు. ఈ ప్రబల కారణం వల్లనే ఆయన ఎన్నిసార్లు కూటములు మారినా ముఖ్యమంత్రిగా కొనసాగారు.  ప్రజల్లో ఆయన నాయకత్వానికి ఆమోదనీయతే లేకపోతే, కూటములు మార్చినా కూడా 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేవాడు కాదనే చెప్పాలి.

లాలూది  జంగల్​ రాజ్ అన్నా.. తేజస్వీని అలాగే చూడడం లేదు!

లాలూ పరిపాలనా కాలం ‘జంగల్​ రాజ్’గా అపవాదుకు గురైన మాట నిజమే. కానీ  బీజేపీ నిన్నటి ఎన్నికల్లో కూడా ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ జంగల్​ రాజ్​ వస్తుందని ప్రచారం చేసింది.  నిజానికి లాలూ శకం ముగిసి 20 ఏండ్లు  దాటింది. ఇపుడు ఆర్​జేడీ లాలూ నేతృత్వంలో లేదు. ఆయన కొడుకు తేజస్వీ యాదవ్​  నాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ‘జంగల్​ రాజ్​’ అనే పదం బహుశా తేజస్వీకి ఆపాదించినా అది వర్కౌట్​ కాదేమో! లాలూ వేరు, తేజస్వీ వేరు అనే విషయం బిహారీ ప్రజలకు తెలుసు. 

సీఎంగా తేజస్వీకే మొగ్గు?

గతంలో  తేజస్వీ రెండుసార్లు నితీశ్​కుమార్​ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు తండ్రికన్నా కొంత భిన్నమైందనే పేరుంది. దాదాపు అన్ని ఒపీనియన్​ పోల్స్​లోనూ ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారనంటే.. తేజస్వీనే ఎక్కువమంది కోరుకుంటున్నట్లు తేలింది కూడా.  అంటే  ఎన్డీఏ నేతలైన నితీశ్​, చిరాగ్​, సమ్రాట్​ చౌదరిని కోరుకున్నవారిని కలిపి చూస్తే.. తేజస్వీకన్నా  ఎన్డీఏ  నేతలను కోరుకున్నవారి సంఖ్య ఎక్కువే అయినా.. వ్యక్తిగతంగా చూస్తే తేజస్వీని కోరుకున్నవారే ఎక్కువ.

నితీశ్​పట్ల పాజిటివ్​ అంశాలు

బిహార్​ ఎన్నికల్లో నితీశ్​కుమార్​కు ఉన్న పాజిటివ్​  అంశాలు ఏమిటంటే.. గ్రామీణ స్థాయికి రోడ్​ కనెక్టెవిటీ పెరిగింది. ఇంటింటికి తాగునీరు, కోతలు లేని విద్యుత్​ అందించడం వంటివి నితీశ్​ కుమార్​  ప్రజల కనీస అవసరాలు తీర్చాడనే చెప్పాలి.  సంక్షేమ పథకాల విషయంలో బిహార్​ మహిళలకు అనేక పథకాలు అందించిన పేరుంది.  ఎన్నికల ముందు పేద మహిళలకు ‘జీవికా దీదీ’ ఉపాధి కోసం రూ.10 వేలు నగదు పంపకం  ఎన్నికల్లో ఎన్​డీఏకు కలిసొచ్చే అంశంగా చెపుతున్నారు.  ఘర్,​ పానీ, బిజిలీ వంటి కేంద్ర పథకాల వల్ల ప్రధాని మోదీ పట్ల కూడా ప్రజల్లో  సానుకూలత ఉండడం నితీశ్​కు కలిసొచ్చే అంశం. 

నెగెటివ్​ అంశాలు

నితీశ్​కుమార్​ పాలన పట్ల ప్రజల్లో  నెగెటివ్​ అంశాలు ఉన్నా అవి అంత బలమైనవి కాకపోయినా.. సుదీర్ఘ కాలంగా (20 ఏండ్లు) ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడం వల్ల ఒకసారి మార్పు కోరితే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రజల్లో కొంతమేరకు ఉంది. నితీశ్​ ప్రభుత్వ హయాంలో అన్నీ బాగానే జరిగాయి కానీ, బిహార్​కు పరిశ్రమలు రాలేదు. ఉపాధి, ఉద్యోగాలు రాలేదనే అభిప్రాయం యువతలో బలంగా కనిపిస్తోంది.  ఈ యువతపైనే ఆర్జేడీ చాలా ఆశలు పెట్టుకుంది కూడా. అందుకే తేజస్వీ  అసాధ్యమని తెలిసినా.. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ప్రకటించాడు. సాధ్యాసాధ్యాల సంగతి పక్కన పెట్టి. యువతలో అసహనాన్ని తేజస్వీ సొంతం చేసుకునే ప్రయత్నం చేశాడు. 

మెజారిటీ సాధించపోతే నితీశ్​కు ఇవే చివరి ఎన్నికలేమో!

కేంద్రంలో మోదీ ప్రభుత్వం నితీశ్​ మద్దతుపై ఆధార పడి ఉంది. కాబట్టి ఒకవేళ ఎన్డీఏ మెజారిటీ సాధిస్తే నితీశ్​కుమారే ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ నితీశ్​కుమార్​ ఈ సారి మెజారిటీ సాధించలేకపోతే ఆయన రాజకీయ చరిత్రకు ఫుల్​స్టాప్​ పడే అవకాశాలే ఎక్కువ!  ఒకవేళ తేజస్వీ యాదవ్​ ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం, ఎన్నికల్లో  మహాఘట్​బంధన్​  యాదవేతర ఓబీసీల మద్దతు ఏమేరకు సాధించగలిగిందనే దానిపైనే అధారపడిఉంటుంది! తేజస్వీ మెజారిటీ 
సాధించలేకపోయినా, ఆయన రాజకీయ జీవితం ఆగేది మాత్రం కాదు. బిహార్ ​ ఫలితాలు    దేశ  రాజ కీయాలను ఎంతోకొంత ప్రభావితం చేస్తాయనే చెప్పాలి.

యాదవేతర ఓబీసీల మద్దతు ఎటు వైపు?

జేడీయూ, బీజేపీ కూటమి వైపు  యాదవేతర ఓబీసీ,  ఈబీసీ, మహాదళిత్​, అగ్రవర్ణాల సంప్రదాయక  మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆర్జేడీ పక్షాన ఎప్పటిలాగే ‘ఎమ్​వై’ ఫ్యాక్టర్​ (ముస్లిం, యాదవ్​) మొగ్గు అలాగే కొనసాగుతోంది. అయితే యాదవేతర బీసీలను ఆకట్టుకుంటే తప్ప అధికారంలోకి రాలేమని తేజస్వీకి తెలుసు. ఈ సారి టికెట్ల పంపకంలో యాదవేతర బీసీ అభ్యర్థులకు బాగానే ప్రాధాన్యమిచ్చాడు. 

కానీ అది ఎంత వరకు వర్కౌట్​ అవుతుందో చెప్పడం కష్టమే. ఎంవై ఫ్యాక్టర్​ దాటి ఇతరుల ఓట్లు సాధిస్తే తప్ప, తేజస్వీ మెజారిటీ సాధించడమనేది కష్టమే! ఒకవేళ యాదవేతర బీసీల ఓట్లను కూడా రాబట్టుకుంటే తప్ప తేజస్వీ మెజారిటీ సాధించడం  కష్టమే! బిహార్​లో నితీశ్​ – ఎన్​డీఏ కూటమిని గెలిపిస్తు వస్తున్నది యాదవేతర ఓబీసీ, ఈబీసీలే కావడం గమనార్హం.

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి,సీనియర్​ జర్నలిస్ట్​