రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఇంకెప్పుడు?

రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఇంకెప్పుడు?

తెలంగాణ రాష్ట్రంలో  భూ సంస్కరణలలో  భాగంగా  భూవివాదాల పరిష్కారం కోసం గత ప్రభుత్వం అప్పటివరకు జిల్లాస్థాయిలో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ మూడంచెల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసింది.  జిల్లా కలెక్టర్  నేతృత్వంలో అదనపు కలెక్టర్ సభ్యుడిగా  రెవెన్యూ  ట్రిబ్యునల్స్​ను ఏర్పాటు చేసింది. 

 భూ పరిపాలనశాఖ వద్ద పెండింగ్​లో  ఉన్న సుమారు 16 వేల కేసులను ట్రిబ్యునల్ కు అప్పగించి నెలరోజుల్లో పరిష్కారం చేయమని గడువు విధించింది.  కలెక్టర్లపై  పనిభారం కారణంగా కేసులు పెద్దగా పరిష్కారం లభించక ప్రజలు చివరకు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది.  

ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రాం (ఎల్ఆర్ యూపీ), రెవెన్యూ ట్రిబ్యునల్స్​ ఏర్పాటు, రద్దు,  ధరణి పోర్టల్ తర్వాత ఆగమేఘాల మీద రెవెన్యూ చట్టం 2020 అమలులోకి వచ్చింది.  కానీ, భూ సమస్యలు ఎక్కడవేసిన గొంగళిలా అక్కడే ఉన్నాయి.

లక్షాలాది కేసులతో కోర్టులపై ఒత్తిడి

ప్రస్తుతం తెలంగాణ జిల్లా,  హైకోర్టులలో 11.82 లక్షల కేసులలో 5,45,245 కేసులు భూములకు సంబంధించినవే కావడం వల్ల కోర్టుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉన్నది.  ఒక్కో కేసు పరిష్కారానికి తరాలు మారుతున్నా సరైన పరిష్కారం లభించడం లేదు.  దీనికి ప్రధాన కారణం రైతులకు భూ సమస్యల పట్ల అవగాహన లేకపోవడం. అయితే,  రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం,  సమాజంలో అరకొర జ్ఞానంతో పెద్ద మనుషులు చెప్పే పంచాయితీలు రైతులను కోర్టు మెట్ల దాకా లాగుతున్నాయి.   

మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన  ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.  మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేసి గెట్టు పంచాయితీ లేని తెలంగాణ నిర్మిస్తాం అని చెప్పి ఏడాది కావస్తున్నా రెవెన్యూ ట్రిబ్యునల్స్​ ఊసేలేదు.  ధరణి పోర్టల్ పేరు (కాంట్రాక్ట్ సంస్థ ధరణి స్థానంలో భుభారతి )గా మార్చి 'కొత్త సీసాలో పాత సారా' అన్నట్టు ఎలాంటి రికార్డుల ప్రక్షాళన చేయకుండా ధరణి పోర్టల్  డేటానే  కొనసాగిస్తున్నారు. పాత రెవెన్యూ చట్టం 2020 బదులు కొత్త రెవెన్యూ చట్టం 2024 అందుబాటులోకి తెచ్చారు.

రెవెన్యూ ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయాలి

రెవెన్యూ సదస్సుల పేరుతో సేకరించిన భూ సమస్యల అప్లికేషన్ల పరిష్కారంలో అటు ప్రభుత్వం ఇటు అధికారుల అలసత్వం కనిపిస్తోంది.  స్వయాన రెవెన్యూశాఖ మంత్రి జిల్లా ఖమ్మంలోనే ఒక్క అప్లికేషన్ కూడా ముందడుగు పడలేదని వార్తలు వస్తున్నాయి.  భూ భారతి చట్టంలో  రెండంచెల అప్పీల్ వ్యవస్థ (తహసీల్దార్ & ఆర్డీవో) పై  కలెక్టర్ కు  ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదు.  

భూ సమస్యల పరిష్కారంలో ఇటు రెవెన్యూ అధికారులు అలసత్వం వీడాలన్నా.. అటు కోర్టులపై సివిల్​ కేసుల భారం తగ్గాలన్నా  తెలంగాణ  రాష్ట్రంలో  రెవెన్యూ ట్రిబ్యునల్స్​ అవసరం ఎంతో ఉన్నది.  ఉమ్మడి పది జిల్లాలు లేదా 33 జిల్లాలలో రిటైర్డ్  జడ్జిల  ఆధ్వర్యంలో  ట్రిబ్యునల్స్​ఏర్పాటు చేయాలి.  ఈ మధ్య  రెవెన్యూ శాఖను  రద్దు చేస్తేనే  ఎలాంటి సమస్య ఉండదు అనే న్యాయస్థానాల వాఖ్యలు చూస్తున్నాం.  ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి భూ సమస్య లేని తెలంగాణ నిర్మాణం కావాలంటే తక్షణమే రెవెన్యూ ట్రిబ్యునల్ లాంటి సంస్కరణలు చేపట్టాలి.

- బందెల సురేందర్ రెడ్డి