మారోజు వీరన్న స్ఫూర్తితో బహుజన రాజ్యం రావాలి

మారోజు వీరన్న స్ఫూర్తితో బహుజన రాజ్యం రావాలి
  • (నేడు మారోజు వీరన్న 25వ వర్ధంతి)

ఆచరణే సిద్ధాంతాన్ని పదును పెడుతుందని బోధించి ఉద్యమకారులను ముందుకు నడిపిన నాయకుడు మారోజు వీరన్న.  ప్రజల ఆపదను తన ఆపదగా భావించి తాను ముందు నిలబడినవాడే నిజమైన విప్లవకారుడని బోధించి ఆచరణాత్మక ఉద్యమాలు చేశాడు కామ్రేడ్  మారోజు వీరన్న.  మాటలు తూటాలుగా, సిద్ధాంతం విప్లవాత్మక మార్పు దిశగా, ఆచరణ పీడిత ప్రజల విముక్తికి దోహదం చేసేవిగా ఉండేవి.  

లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలని, ఆచరించే దమ్ముండాలని, అన్నింటికీ మించి ప్రజల పట్ల  ప్రేముండాలని బోధించి ఆచరించినవాడు వీరన్న.  మారోజు వీరన్న సిద్ధాంతం, ఆయన వేసిన బాట మెజార్టీ  ప్రజలకు రాజ్యాధికారం చేపట్టడానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా జనాభాలో 60 శాతంగా ఉన్న బీసీల విముక్తికి, చట్టసభల్లో బీసీ వాటా సాధనకు ఉపయోగపడుతుంది.  

పాలకుల పీఠాలను కదిలించిన వీరన్న

మారోజు వీరన్న ఒక విద్యార్థి నాయకుడుగా, గాయకుడుగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి ప్రగతిశీల విద్యార్థి విభాగాన్ని నిలబెట్టాడు.  క్యాపిటేషన్  ఫీజుకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాలకు ట్యూషన్ ఫీజు గురించి ఉద్యమించి పాలకుల పీఠాలను కదిలించాడు. దేశంలో సగానికి పైగా జనాభా గల బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించిన మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా ఆధిపత్య కులాలు చేసిన తప్పుడు ఉద్యమానికి వ్యతిరేకంగా, మండల్ అనుకూల ఉద్యమంలో అందరికంటే వీరన్న ముందు నిలిచాడు.  

ప్రజా యుద్ధ నౌక గద్దరన్నపై కాల్పుల సందర్భంలో కూడా అందరికన్నా ముందే వీధుల్లోకి వచ్చి ఉద్యమించాడు. సాయుధ పోరాట వారసత్వమై, సర్దార్ సర్వాయి పాపన్న, వీరబ్రహ్మంల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సీమాంధ్ర అగ్రకుల పెత్తనంలో నలిగిపోతున్న తెలంగాణ విముక్తికి మలిదశ ఉద్యమ కెరటాన్ని ఎగురవేశాడు. మారోజు వీరన్న 1997లో  సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ మహాసభను స్థాపించాడు. యువతరమా, నవతరమా.. విద్యార్థులారా నవ నిర్మాతలు మీరేనంటూ విద్యార్థులకు, యువకులకు వీరన్న మార్గనిర్దేశం చేశాడు.

బహుజన రాజ్యస్థాపన వీరన్న లక్ష్యం

కేసీఆర్ నోట వచ్చిన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన 1997లోనే  వీరన్న చేశాడు. ఫెడరల్​తో బహుజన రాజ్య స్థాపన మారోజు వీరన్న లక్ష్యం.  అందుకే విభిన్న భాషలు, విభిన్న సంస్కృతి, విభిన్న జీవన విధానం, విభిన్న ఆర్థిక స్థితిగతులున్న ఇండియాలోని రాష్ట్రాలను  సంయుక్త రాష్ట్రాలుగా పేర్కొని, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి) సీపీయూఎస్ఐ (డీబీఎస్​వీ) పార్టీని స్థాపించి సాయుధ పోరాట పంథాలోనే  దేశంలో కొత్త శకాన్ని మొదలుపెట్టిన ఘనుడు ఆయన. ఏక కాలంలో రెండు లక్ష్యాలను సాధించడం మారోజు వీరన్న వ్యూహం. 

1997లో తెలంగాణ మహాసభ స్థాపించి వ్యూహాత్మకంగా ముందుకుసాగాడు.  తెలంగాణ మహాసభలో మహా మహా మేధావులు పాల్గొనేటట్లు చేయడంలో  వీరన్న కృషి చాలా గొప్పది.  తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్,  తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వి. ప్రకాష్,  డాక్టర్  చెరుకు సుధాకర్,  సాంబశివరావు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళను 1997లోనే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేశాడు. ఐడెంటిటీ అండ్ అలయన్స్ అనే సిద్ధాంతంతో ఏ కులానికి ఆ కులాన్ని ఐడెంటిఫై చేసుకొని అంతిమంగా అణగారిన కులాలన్నింటిని ఐక్యత చేయడం లక్ష్యంగా ముందుకు సాగిన వీరన్నను లక్ష్యం చేరకముందే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టుకొని కాల్చి చంపింది. 

దోపిడీ శక్తులను ప్రజాప్రభుత్వం అరికట్టాలి

హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారం, కుల రహిత,  వర్గ రహిత సమాజ స్థాపనకు మార్క్స్, లెనిన్, మావోలకు తోడు ఫూలే, అంబేద్కర్​లను జతకలిపిన వీరన్న తను నమ్మిన సిద్ధాంతాన్ని బోధించి ఆ ఆచరణలో ప్రాణాలర్పించాడు. మారోజు వీరన్న నేడు  దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఆదర్శం కావాలి. 1999 మే 16 న సీమాంధ్ర పాలకులు వీరన్నను బూటకపు ఎన్​కౌంటర్​లో కాల్చి  చంపబడ్డారు. 

కానీ,  వీరన్న త్యాగఫలంతో  తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం మరింత విస్తృతమైంది.  2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా దోపిడీ శక్తుల దోపిడీ మాత్రం ఆగలేదు. సామాజిక దోపిడీ, శ్రమ దోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీతో తెగ బలిసిన దోపిడీ వర్గాలు నేడు విద్య, వైద్య వ్యాపారంతో అణగారిన ప్రజల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. అనేక పోరాటాలు, త్యాగాలతో, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకుల విధానాల వల్ల దోపిడీ మరింత ఎక్కువైంది.  కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ దోపిడీని అరికట్టి సామాన్య ప్రజల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించి అమలు చేయాల్సిన అవసరముంది. 

మూస ఉద్యమాలను వీడాలి

ఎన్నో పోరాటలకు, త్యాగాలకు కేంద్రమైన తెలంగాణలో బహుజన ఉద్యమకారులు మూస ధోరణిని వీడాలి. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా ఉద్యమ శక్తులు ముందుకు సాగాలి.  కామ్రేడ్ మారోజు వీరన్న స్పూర్తితో చట్టసభల్లో బీసీలకు వాటా సాధిద్దామని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో తెలంగాణలో జరిగిన 400 కిలోమీటర్ల పాదయాత్ర బీసీ ఉద్యమకారులకు దిక్సూచి కావాలి. 

బీసీ సమాజాన్ని చైతన్యపరిచి ఐక్యం చేయాల్సిన అవసరముంది. గత 25 ఏండ్లుగా దేశంలో అణగారిన ప్రజల కోసం పూర్తికాలం ఉద్యమాలు జరగకపోవడం వల్లనే  మెజార్టీ  ప్రజలైన బీసీలు ఆధిపత్య రాజకీయ పార్టీల్లో ఎదగలేకపోతున్నారు.  మహాత్మా  ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్,  సావిత్రి బాయి ఫూలేల నిజమైన వారసుడు మారోజు వీరన్న 25వ వర్ధంతి మే 16 ను తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన  చేద్దామని ప్రతి బహుజనుడు ప్రతినబూని ఉద్యమించాలి. బహుజన రాజ్యాన్ని స్థాపించడమే కామ్రేడ్ మారోజు వీరన్నకు నిజమైన నివాళి. 

సాయిని నరేందర్,
సోషల్​ ఎనలిస్ట్