
ఈమధ్య ప్రసార మాధ్యమాలు, పత్రికలు, సోషల్ మీడియాలలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, బిడ్డలు అని వార్తలు ఎక్కువగా చూస్తున్నాం. సంతానం ఎందుకు పట్టించుకోవడం లేదంటే వారి అవసరాలు తీరి ఎదిగిపోవడమే.
గొప్ప సంపాదన, ఓ స్థాయికి ఎదిగి సంఘంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నాం అనే భావనతో సంతానం ఉంటున్నారు. కానీ, కనిపెంచిన తల్లిదండ్రులను విస్మరించడం శోచనీయమైన విషయం. అయితే, ప్రస్తుత బిడ్డలు తాము కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించకపోవడం వలనే ఈ పరిస్థితి వస్తున్నది.
సింగరేణి సంస్థ కూడా మహోన్నతికి తోడ్పడిన రిటైర్డ్ ఉద్యోగులను విస్మరిస్తున్నది. ఉచితంగా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని పదే పదే కోరుతున్నా ఫలితం శూన్యం. సింగరేణి కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా 41:59 అధీనంలో నడుస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థ. వేతన ఒప్పందాలు చట్టరీత్యా బావుల తవ్వకం, మూసివేత ఇతరత్రా మాత్రమే కోల్ ఇండియాతో సంబంధం లేనివిధంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్ పాలసీ అనేక ఉన్నతమైన సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇంతేగాక లాభాల వాటా కూడా ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నారు.
కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు కల్పించడానికి కోల్ ఇండియా నియమ, నిబంధనలు అడ్డువస్తున్నాయి అని తెలుపుతున్నారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రజా, కార్మిక సంక్షేమానికి మారుపేరైన మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సూచించినా యాజమాన్యం వైద్య సౌకర్యాలు కల్పించుటకు కనికరించడం లేదు. ఆకాశమే హద్దుగా ఇతర రంగాలలో ప్రవేశించడానికి సంస్థ కృషి చేస్తున్నది. .
రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి ఇతోధికంగా పాటుపడుతున్న విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఉచితంగా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని మనసారా వేడుకొంటున్నాం. ప్రస్తుతం సింగరేణి హాస్పిటల్ లలో ఔట్ పేషెంట్, సిపిఆర్ఎంఎస్ ద్వారా వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. అచేతన వ్యవస్థలో ఉన్న మాకు దినదినం పెరుగుతున్న వైద్య ఖర్చులు సరిపడక జీవిత చివరి రోజులలో అల్లాడిపోతున్నాం. ప్రభుత్వం పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించాలి.
- దండంరాజు రాంచందర్రావు-