Ashes 2025-26: 20 ఏళ్ళ ముందే మేము బజ్ బాల్ పరిచయం చేశాం.. యాషెస్‌కు ముందు హీట్ పెంచేసిన గిల్‌క్రిస్ట్

Ashes 2025-26: 20 ఏళ్ళ ముందే మేము బజ్ బాల్ పరిచయం చేశాం.. యాషెస్‌కు ముందు హీట్ పెంచేసిన గిల్‌క్రిస్ట్

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా  జట్ల మధ్య జరగబోయే ప్రతిష్టాత్మకమైన యాషెస్ కు నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇండియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్ ల తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు యాషెస్ లో తలపడతాయి. నవంబర్ 21 నుంచి జరగబోయే ఈ సమరానికి ఆస్ట్రేలియా వేదిక కానుంది. ఈ మెగా సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇంగ్లాండ్ పై అదిరిపోయే కౌంటర్ విసిరి సిరీస్ కు ముందు హీట్ పెంచేశాడు. 

ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ ఇటీవలే ఆస్ట్రేలియాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బజ్ బాల్ ఆట తీరు ముందు ఆస్ట్రేలియా తట్టుకోలేదు అనేట్టుగా కామెంట్స్ చేశాడు. క్రాలీ కామెంట్స్ కు గిల్‌క్రిస్ట్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " మేము 20 సంవత్సరాల ముందే బజ్ బాల్ ఆట ఆడేవాళ్ళం. 2000 సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా దూకుడైన ఆట తీరు ఆడింది. రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్ వంటి ఆటగాళ్ళు టెస్ట్ క్రికెట్‌లో ఎటాకింగ్ ఆడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేవారు. బజ్ బాల్ ఆటకు ఆకర్షణీయంగా మారుతుంది. రానున్న యాషెస్ లో ఇది కొనసాగాలని భావిస్తున్నాను".  అని కాయో స్పోర్ట్స్‌లో గిల్‌క్రిస్ట్ అన్నాడు. 

క్రికెట్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా యాషెస్ కు ఎక్కువ క్రేజ్ ఉందని భావిస్తారు. 1882లో తొలిసారి యాషెస్ సిరీస్‌ జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ వచ్చినప్పుడల్లా క్రికెట్‌ ప్రపంచంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. నవంబర్ 21 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఎలాగైనా ఆసీస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. 

చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా చివరి 15 స్వదేశీ టెస్టుల్లో రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇప్పటి వరకూ చరిత్రలో మొత్తం 330 యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 136 టెస్టులు, ఇంగ్లండ్‌ 108 టెస్టులు గెలవగా.. 91 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇటీవలే ఇండియాతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా వెస్టిండీస్ పై 3-0 తేడాతో గెలిచింది.