- క్షుద్రపూజల పేరుతో లక్షలు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి, వెలుగు : ‘మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నయ్ వాటిని తీయకపోతే కుటుంబంలో ఒకరు చనిపోతారు’ అని భయపెట్టి క్షుద్ర పూజల పేరుతో లక్షలు వసూలు చేసిన వ్యక్తిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర సోమవారం మీడియాకు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన కడమంచి నర్సింలు అలియాస్ నర్సారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు క్షుద్ర పూజల పేరిట అమాయకులను నమ్మించి లక్షలు వసూలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వను కలిసి తనకు వాస్తు, క్షుద్రపూజలు తెలుసునని నమ్మించారు. బీరవ్వ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని, వాటిని బయటకు తీయకపోతే ఫ్యామిలీలో ఒకరు చనిపోతారని భయపెట్టారు. పూజలు చేసేందుకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పడంతో గత నెల 26న కామారెడ్డిలో రూ.8.20 లక్షలు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న అనంతరం సదరు వ్యక్తులు కనిపించకుండాపోయారు.
ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బీరవ్వ కామారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టి నర్సింలును అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతేడాది చిన్నమల్లారెడ్డిలో భిక్షాటనకు వెళ్లి లాస్య అనే మహిళ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసకొని, ఇంట్లో ఉన్న లంకె బిందెలను బయటకు తీస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మించి రూ. రూ. 2.93 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై సదాశివనగర్, జనగామ జిల్లా కొడకండ్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో సైతం నేరాలు చేసినట్లు తేలిందన్నారు. నర్సింలు వద్ద నుంచి రూ. 7 లక్షలతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
