- ఆడబిడ్డలను ఏడిపిస్తే మంచిది కాదు.. ఇప్పటికే అనుభవిస్తున్నావ్
- మహాజాతరపై తప్పుడు ట్రోల్స్ చేయిస్తున్నరు
- ఆదివాసీ దేవుళ్లపై అసత్యప్రచారం చేస్తే నష్టపోతరు : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : ‘మేడారం సమ్మక్క సారలమ్మ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో వైభవంగా జాతర నిర్వహించాం, కానీ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు, బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ఒక్కసారైనా మేడారం వచ్చారా ? ఆయన దురహంకారం తగ్గించుకొని మాట్లాడాలి’ అని మంత్రి సీతక్క మండిపడ్డారు. ములుగులోని డీఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆడబిడ్డలను ఏడిపిస్తే మంచిది కాదని, ఇప్పటికే కేటీఆర్ అనుభవిస్తున్నారన్నారు. మహాజాతర ప్రారంభానికి 40 రోజుల ముందు నుంచే భక్తులు తరలివచ్చారన్నారు.
జాతర ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొన్ని పార్టీలు, మీడియా సంస్థలు, కొందరు స్వాములు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జాతర నిర్వహణలో భాగంగా వారం రోజుల పాటు మేడారంలోనే ఉండి పనిచేశామని, కోట్లాది మంది భక్తులు సంతోషంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మేడారంలో ప్రతి మార్పు పూజారుల ఆమోదం, ఎండోమెంట్ ఆఫీసర్ల అనుమతితోనే జరిగిందని స్పష్టం చేశారు. ‘రాజకీయంగా నాపై విమర్శలు చేయండి.. కానీ దేవుళ్లపై చేయొద్దు.. మహాజాతర నిర్వహణలో ఏమైనా తప్పులు చేస్తే వనదేవతలే చూసుకుంటారు, అసత్య ప్రచారాలు చేసే వారిని సైతం వారే చూసుకుంటారు’ అని అన్నారు.
30వ తేదీ సాయంత్రం వీఐపీలు ఎక్కువ వాహనాల్లో రావడానికి తోడు, మేడారం – తాడ్వాయి రూట్‌లో బస్సులు బ్రేక్‌డౌన్ కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయన్నారు. ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, భవిష్యత్‌లో జిల్లాను అగ్ర స్థానంలో నిలబెట్టేందుకు మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. మున్సిపాలిటీలోని 20 కౌన్సిలర్ వార్డులను గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్‌ఖాన్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
