
హైదరాబాద్: తెలంగాణలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం (అక్టోబర్ 16) హైదరాబాద్ లోని డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఆర్ అండ్ బి శాఖ పరిధిలో నిర్మించే హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.10 వేల 547 కోట్ల వ్యయంతో నిర్మించే 5 వేల566 కి.మీ రోడ్లకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, సహచర మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కోమటి రెడ్డి. వారంలోగా టెండర్లు నిర్వహిస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా అద్దంలాంటి రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ రోడ్లు దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా వేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రకాల రోడ్ల వివరాలను వెల్లడించారు మంత్రి.
రాష్ట్రవ్యాప్తంగా 1,791 కి.మీ మేరకు విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. వీటి వ్యయం – 6,152 కోట్లు.
సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ -866 కి.మీ – 2,377 కోట్లు,
డబుల్ లేన్ 10 మీటర్ల రోడ్డు - 779 కి.మీ - 2,637 కోట్లు,
4లేన్ రోడ్లు - 124 కి.మీ - 735 కోట్లు
బలోపేతం చేసే రోడ్లు మొత్తం – 3,775 కి.మీ
వ్యయం – 4,395 కోట్లు,
సింగిల్ లేన్ -768 కి.మీ - 674 కోట్లు,
డబుల్ లేన్ - 2,618 కి.మీ - 3031 కోట్లు,
డబుల్ లేన్(10 మీటర్ల రోడ్డు) - 148 కి.మీ - 225 కోట్లు..
4లేన్ - 221 కి.మీ 444 కోట్లు అని మంత్రి వెల్లడించారు.
ఆర్ అండ్ బి సర్కిళ్ల వారిగా మొత్తం 32 ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. అందులో మొదటి ఫేజ్ లో 10 ప్యాకేజీలు వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టనునట్లు తెలతిపారు.
వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, వచ్చే 30నెలల్లో ప్యాకేజీల వారిగా అన్ని రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.