
భారతదేశంలో ఉద్యాన రంగం అనేది కేవలం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి మాత్రమే కాకుండా, దేశ పోషకాహారభద్రత కోసం కూడా కీలకమైనది. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూలసాగు ఈ రంగం పరిధిలోకి వస్తాయి.ఈ ఉత్పత్తులు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తాయి. తద్వారా పోషకాహార లోపం సమస్యలను ఎదుర్కోవడంలో, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆహారంలో పోషక విలువలను పెంచడానికి ఉద్యానవన ఉత్పత్తులు తప్పనిసరి. గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఉద్యానవన రంగం అద్భుతమైన వృద్ధిని సాధించింది. పెరుగుతున్న దేశీయ, అంతర్జాతీయ డిమాండ్, ప్రభుత్వ ప్రోత్సాహం, ఆధునిక సాగు పద్ధతుల వినియోగం వల్ల ఈ ఉత్పత్తులలో వృద్ధి గణనీయంగా ఉంది. ఈ పెరుగుదల, ధాన్యాల ఉత్పత్తిని మించిపోయి, మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో ఉద్యాన వాటాను పెంచింది. ఈ వృద్ధి రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయంలో వైవిధ్యాన్ని సాధించడానికి దోహదపడుతోంది.
విస్తరణకు సలహాల కొరత
దేశంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విస్తరణ నెట్‌వర్క్, చాలావరకు ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ అలాగే కేవలం వాణిజ్య పంటలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. విస్తరణ అధికారులు, వారికి ఇచ్చే శిక్షణ, వనరులు ప్రధానంగా ఈ పంటలకే ఉపయోగపడుతున్నాయి. అయితే, ఉద్యానవన పంటలు ముఖ్యంగా కూరగాయలు, పండ్ల పంటలు వాటికి ప్రత్యేకమైన, నిశితమైన నిర్వహణ, భిన్నమైన సాంకేతిక సలహాలు అవసరం.
ఉద్యానవనానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విస్తరణ సిబ్బంది కొరత కారణంగా, రైతులు తరచుగా సరైన, సమయానుకూలమైన సమాచారం, సలహాలను పొందలేకపోతున్నారు, దీనివల్ల పంట నిర్వహణలో లోపాలు తలెత్తుతున్నాయి.
వాతావరణ ప్రభావం
ఉద్యానవన పంటలైన పండ్లు, కూరగాయలు స్వభావరీత్యా అత్యంత సున్నితమైనవి. త్వరగా చెడిపోయే గుణం కలిగినవి. వీటిని కాపాడుకోవడానికి పటిష్టమైన విస్తరణ నెట్‌వర్క్, ప్రత్యేకించి వ్యవసాయ వాతావరణ సలహా, సేవలు అత్యంత అవసరం. కూరగాయలు, పండ్ల పంటలు తెగుళ్లు, వ్యాధుల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది.
ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షపాతం వంటి వాతావరణ అంశాలు, తెగుళ్లు, వ్యాధుల వ్యాప్తిపై, అలాగే వాటిని నివారించడానికి వాడే పురుగు మందుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ సేవలు, నిర్దిష్ట వాతావరణ పరిస్థితుల ఆధారంగా, ఎప్పుడు, ఏ రకమైన నివారణ చర్యలు తీసుకోవాలనే దానిపై రైతులకు ఖచ్చితమైన సూచనలను అందించాలి. రసాయనాల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించి, ఖర్చును ఆదా చేస్తాయి.
ఇవి సున్నిత పంటలు
ఉద్యానవన పంటలు అతి తీవ్రమైన వాతావరణ సంఘటనలు అధిక వర్షపాతం, అకాల వర్షాలు, వడగళ్ల వర్షం, అనావృష్టి, అధిక ఉష్ణోగ్రతలకు చాలా సున్నితంగా ఉంటాయి. ఉదాహరణకు, పండ్లు పూత దశలో ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతలు పూత రాలిపోవడానికి కారణమవుతాయి. కోత సమయంలో భారీ వర్షాలు పంట నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
వ్యవసాయ వాతావరణ సలహాల ద్వారా వాతావరణ హెచ్చరికలు, అంచనాలు రైతులకు ముందుగా తెలియజేయడం వల్ల తగిన జాగ్రత్తలు అంటే సమయానికి కోత, షేడ్ నెట్‌ల ఏర్పాటు, నీటిపారుదల వంటివి తీసుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా పంట నష్టాన్ని తగ్గించి, ఉద్యానవనాన్ని లాభదాయకంగా మార్చవచ్చు.
ఆర్థిక వ్యవస్థకూ ఊతం
ఉద్యానవన రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడానికి, పోషకాహార భద్రతను పెంచడానికి, రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడానికి, ఉద్యానవనంపై ప్రత్యేక దృష్టి సారించాలి. సాంకేతిక పరిజ్ఞానం ఆధారితమైన బలమైన విస్తరణ నెట్‌వర్క్‌ను నిర్మించడం తప్పనిసరి. నైపుణ్యం కలిగిన సిబ్బంది ద్వారా వ్యవసాయ వాతావరణ సలహా సేవలను అందించడం, అత్యాధునిక సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వడం, మార్కెట్ లింకేజీలను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ఉద్యానవన రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడమే పరిష్కారం. ఈ పటిష్టమైన నెట్‌వర్క్ ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేస్తేనే ఉద్యాన పంటలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.
- డా. దండా రాజి రెడ్డి, వైస్ చాన్సలర్, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం-
- డా. బులుసు వెంకట రమణారావు, రిటైర్డ్ వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త-