Sudheer Babu: ధన పిశాచి విశ్వరూపం.. ఆసక్తి రేపుతున్న 'జటాధర' ట్రైలర్ !

Sudheer Babu: ధన పిశాచి విశ్వరూపం.. ఆసక్తి రేపుతున్న 'జటాధర' ట్రైలర్ !

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న  థ్రిల్లర్  చిత్రం 'జటాధర'. డివోషనల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఇప్పటికే టీజర్ విడుదలై అంచనాలు పెంచగా, తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడం సినిమాకు మరింత హైప్ ఇచ్చింది.

ధన పిశాచిగా సోనాక్షి సిన్హా..

 'జటాధర' కథాంశం 'ధన పిశాచి' అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. "పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవాడు" అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవడం కథలోని లోతును తెలియజేస్తోంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో సోనాక్షి సిన్హా ప్రధాన విలన్ పాత్రలో విశ్వరూపం చూపించింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఆమె పాత్ర చాలా శక్తిమంతంగా, ఉగ్రరూపంలో కనిపిస్తుంది.

భారీ తారాగణం..

ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రానికి వెంకటేశ్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత ఏడాది ఆగస్టులోనే అధికారికంగా ప్రకటించబడింది. జీ స్టూడియోస్ , ప్రేరణా అరోరాతో పాటు ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా వంటి ప్రముఖులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ థ్రిల్లర్‌లో సోనాక్షి సిన్హాతో పాటు, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా వంటి ముఖ్య పాత్రలు కనిపించనున్నాయి. శిల్పా శిరోద్కర్ పాత్రకు సంబంధించిన సీన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అలాగే, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుబ్బలేఖ సుధాకర్ వంటి భారీ తారాగణం ఇందులో భాగమైంది. సమీర్ కల్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

'జటాధర' చిత్రం నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బలమైన సాంకేతిక బృందం, భారీ తారాగణం, ,ధన పిశాచి అనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.