IND vs AUS: ఇండియాపై సిరీస్ గెలిచేది మేమే.. లీడింగ్ రన్ స్కోరర్ మాత్రం అతనే: మైకేల్ క్లార్క్

IND vs AUS: ఇండియాపై సిరీస్ గెలిచేది మేమే.. లీడింగ్ రన్ స్కోరర్ మాత్రం అతనే: మైకేల్ క్లార్క్

ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా, ఇండియా సిరీస్ పై భారీ హైప్ నెలకొంది. ఈ మెగా సిరీస్ చూడడానికి ఫ్యాన్స్ నాలుగు నెలలు ముందే టికెట్స్ బుక్ చేసుకున్నారంటే ఈ రెండు జట్ల మధ్య క్రేజ్ ఎలాంటిందో అర్ధం చేసుకోవచ్చు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడడం.. పైగా ఆస్ట్రేలియాతో సిరీస్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటాయి. మొదట మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ సిరీస్ ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. 

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ వన్డే సిరీస్ ఎవరు గెలుస్తారో తన ప్రిడిక్షన్ చెప్పుకొచ్చాడు. బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తమ జట్టు ఆస్ట్రేలియాకు సపోర్ట్ చేశాడు. ఆస్ట్రేలియా ఇండియాపై 2-1 తేడాతో సిరీస్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. " సిరీస్ ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. వర్షం అంతరాయం కలిగించకుండా సిరీస్ జరిగితే 2-1 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ గెలుస్తుందని నేను చెప్పగలను. ఆస్ట్రేలియాకే నేను కట్టుబడి ఉంటాను. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తారు అనుకుంటున్నా. ఆస్ట్రేలియా లాంటి కండీషన్ లో మూడు లేదా నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కొంచెం ఈజీ. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు కాబట్టి ఈ సిరీస్ లో కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడని అనుకుంటున్నా". అని క్లార్క్ అన్నాడు. 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఆస్ట్రేలియాలో అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. రోహిత్ ఆసీస్‌పై 58.23 యావరేజ్ తో 990 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ 41.17 యావరేజ్ తో 802 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఏడు నెలల తర్వాత రోకో జోడీ ఆస్ట్రేలియాలో ఎలా ఆడుతుందో ఆసక్తికరంగా మారింది. వీరిద్దరితో పాటు టీమిండియా కొత్త కెప్టెన్ శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. 

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది.