
- రాజ్ భవన్ ముందు బైఠాయించిన సీపీఎం
- అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలంటున్న డిప్యూటీ సీఎం
- రామచందర్‌రావు ముందుకు రావాలన్న భట్టి విక్రమార్క
- బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ పైనా ఒత్తిడి తేస్తామన్న కృష్ణయ్య
- బీజేపీ బంద్ లో పాల్గొంటోందంటే బిల్ పాస్ చేసినట్టు భావించాలా: జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీలు, బీసీ సంఘాలు బీజేపీనే టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే 42% రిజర్వేషన్లు సాధ్యమేనని, కావాలనే గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ఆపాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి రిజర్వేషన్లను పెంచడం కూడా సాధ్యమేనని అంటున్నారు. బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రేపటి బంద్ కు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. కొద్ది సేపటి క్రితం ఇదే విషయమై సీపీఎం నాయకులు గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు రాగా.. లోనికి అనుమతించలేదు. దీంతో వారు రాజ్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు.
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకి అని విమర్శించారు. ఈ ఆందోళనలో ఎస్ వీరయ్య, సాగర్, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా రేపటి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య, మందకృష్ణమాదిగ, అద్దంకి దయాకర్ సహా పలువురు నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా అద్దంకి మాట్లాడుతూ.. బీజేపీ అనుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్ లో పాల్గొంటోంది.. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలుస్తామని అడిగినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇప్పించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న ఆర్ కృష్ణయ్య నిన్న మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో చేరలేదని, బీసీ ఉద్య నాయకుడిగా పార్టీలే తనను చేర్చుకున్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీపైనా ఒత్తిడి తెస్తానని కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో అందరి వేళ్లూ బీజేపీని చూపిస్తుండటం గమనార్హం.