జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలవాలి..అభివృద్ధి జరగాలి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్  గెలవాలి..అభివృద్ధి జరగాలి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
  • నువ్వు గెలవాలి..అభివృద్ధి జరగాలి
  • అన్ని వర్గాలనూ కలుపుకోని పోవాలె
  • నవీన్ యాదవ్  కు ఎంపీ అసద్ మద్దతు
  •  ఆలింగనం చేసుకొని ఆల్ ది బెస్ట్
  • అట్టహాసంగా నవీన్ యాదవ్ నామినేషన్
  • హాజరైన మంత్రులు వివేక్, పొన్నం,మేయర్


హైదరాబాద్: పదేండ్ల  పాటు రాష్ట్ర పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇవాళ నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా షేక్ పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంపీ అసదుద్దీన్ నవీన్ యాదవ్ ను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నువ్వు గెలవాలని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోవాలంటూ సూచించారు.  నామినేషన్ సందర్బంగా నవీన్ యాదవ్  భారీ  ర్యాలీ నిర్వహించారు. నామినేషన్  సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..  ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ఓట్ చోరీ అంశాన్ని ముందరేసుకుందన్నారు. 

 పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము రెండేండ్లలో ఏం చేశామో చెప్తామని వివరించారు. ప్రజాభిప్రాయం మేరకే నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించినట్టు చెప్పారు. కంటోన్మెంట్ లో శ్రీ గణేశ్ ను గెలిపించినట్టుగానే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో  ప్రజా పాలన కొనసాగుతోందని, జూబ్లీహిల్స్ ను రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామని చెప్పారు.

 కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతూ..  తనకుకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో జూబ్లీహిల్స్ లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని అన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.