2026 T20 World Cup: సస్పెన్స్‌కు తెర.. టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన 20 జట్ల లిస్ట్ ఇదే!

2026 T20 World Cup: సస్పెన్స్‌కు తెర.. టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన 20 జట్ల లిస్ట్ ఇదే!

2026 టీ20 వరల్డ్ కప్ ఆడే 20 జట్లు ఏవో తేలిపోయాయి. గురువారం (అక్టోబర్ 16) జపాన్ పై యూఏఈ ఘన విజయం సాధించడంతో  ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన 20 జట్ల విషయంలో సస్పెన్స్ కు తెర పడింది. నిన్నటివరకు 19 జట్లు అర్హత సాధించగా తాజాగా యూఏఈ ఈ పొట్టి సమరానికి అర్హత సాధించిన 20 వ జట్టుగా నిలిచింది. క్వాలిఫయర్స్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జపాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యూఏఈ 12.1 ఓవర్లలో 118 పరుగులు చేసి విజయం సాధించింది. 

ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించాయి. 2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఈ లిస్టులో ఉన్నాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ సూపర్ 8 కు అర్హత సాధించకపోయినా  ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి. దీంతో 20 జట్లలో క్వాలిఫై మ్యాచ్ లు ఆడకుండానే ఈ 12 టీమ్స్ 2026 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.

క్వాలిఫయర్స్ ద్వారా కెనడా కూడా అర్హత సాధించి 13 వ జట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా క్వాలిఫై అయ్యాయి. 18, 19వ జట్లుగా ఒమన్, నేపాల్ నిలిచాయి. జపాన్ పై విజయంతో యూఏఈ 20 జట్టుగా నిలిచింది. మొత్తం 20 జట్లు టోర్నీకి అర్హత సాధించడంతో ఇప్పుడు గ్రూప్ లు ఎలా ఉండబోతున్నాయి ఆసక్తికరంగా మారింది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కన్ఫర్మ్ కాగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పొట్టి సమరాన్ని రెండేళ్ల కొకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడడం తప్పితే ప్రతి రెండు సంవత్సరాలకు ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. తాజాగా ముగిసిన 2024 టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ముగిసిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 

టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 20 జట్ల లిస్ట్ ఇదే:

భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా, ఒమన్, నేపాల్, జపాన్