అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం (October 17) : పేదరికాన్ని జయించలేకపోతున్నాం!

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం (October 17) : పేదరికాన్ని జయించలేకపోతున్నాం!

ప్రపంచంలో ఆకలి, పేదరికం, హింస, ఆత్మహత్యలకు ప్రధానకారణం పేదరికంలో మగ్గడమే. పేదరికాన్ని జయించడంలో ఓడిపోతున్న మనిషి అర్ధంతరంగా తనువు చాలిస్తున్నాడు, ప్రతి సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం జరుపుకోవాలి అని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1992 డిసెంబర్ 22న తీర్మానాన్ని ఆమోదించింది.  

పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2025వ  సంవత్సరాన్ని పురస్కరించుకుని  కుటుంబాలకు  గౌరవం, సమర్థవంతమైన మద్దతును నిర్ధారించడం ద్వారా సామాజిక, సంస్థాగత దుష్ప్రవర్తనను అంతం చేయడం అనే నినాదంతో తీసుకొచ్చింది.  ఐక్యరాజ్యసమితి ప్రకారం 2024 సంవత్సరం చివరినాటికి ప్రపంచ జనాభాలో 670 మిలియన్ల మంది పేదరికంతో బాధపడుతున్నారు.  

పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి.  దారిద్ర్యరేఖ కింద ఉన్నవాళ్లకు సరైన ఆహారం, వైద్యం అందకపోవడం, పేదరికంలో ఉన్నవాళ్లకు సరైన సహాయసహకారాలు అందకపోవడం, విద్యాభ్యాసం పట్ల అవగాహన రాహిత్యం వలన చదువుకు దూరంగా ఉండడం, సరైన ఆహారం అందక వివిధ రుగ్మతల బారినపడటం ఇలా అనేక కారణాలు ఉన్నాయి. పేదరికం కారణంగా పేదలు తమ హక్కులను కోల్పోతున్నారు. పేదరికం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి.  

పేదరికంలో జీవిస్తున్న ప్రజలు, వారిని బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాలు వృథానే  అవుతున్నాయి.  ఆధునిక టెక్నాలజీ యుగంలో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు, అంతరిక్షాన్ని సైతం చేరుకుంటున్నాడు.  కానీ, పేదరిక నిర్మూలనకోసం సరైన దిశానిర్దేశం చేయలేకపోవడం, 
పేదరికంనుంచి వాళ్ళను బయటకు తీసుకరాలేకపోవడం అతి పెద్ద లోపం.  ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సంస్కరణలు చేసినా కార్యరూపం దాల్చకపోతే వృథానే.  సమాజంలో అందరూ సమానమే  అనేది పాలనలో  ప్రతిబింబించాలి.  

ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆహారం, దుస్తులు పొందాల్సిందే, అలాంటి చట్టాలను కఠినంగా రూపొందించి, ఖచ్చితత్వంతో ఆచరణలో తీసుకొచ్చినప్పుడే పేదరికం నుంచి బయటకు రాగలుగుతారు. సమాజంలో గౌరవంగా జీవించే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి.

- డాక్టర్. వై. సంజీవ కుమార్-