రామగుండం 62.5 మెగావాట్ల థర్మల్ స్టేషన్ మూసివేత

రామగుండం 62.5 మెగావాట్ల థర్మల్ స్టేషన్ మూసివేత
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • 52 ఏండ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసిన పవర్ ప్లాంట్​ 
  • ఈ ప్లాంట్ స్థలంలోనే కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి సర్కారు నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: 50 ఏండ్లకు పైగా విద్యుత్ ఉత్పత్తిలో సేవలందించిన రామగుండం 62.5 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌‌ను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1971లో ప్రారంభమైన ఈ పవర్ ప్లాంట్ విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషించింది. ఐదు దశాబ్దాలకుపైగా రాష్ట్రానికి, దేశానికి సేవలందించి అనేక రికార్డులు, మైలురాళ్లను నెలకొల్పింది. 

25 ఏండ్ల కాల పరిమితితో ఏర్పడిన ఈ పవర్ ప్లాంట్ 52 ఏండ్ల 7 నెలల పాటు సేవలందించింది. 3.68 లక్షల గంటలకు పైగా పనిచేసింది. మొత్తం 18,743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. పరికరాల సామర్థ్యం దగ్గర పడటంతో 2024, జూన్​4న ఈ పవర్ ప్లాంట్‌‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపేశారు. దీనిని పూర్తిగా క్లోజ్ చేయడానికి అనుమతించాల్సిందిగా రాష్ట్ర జెన్‌‌కో సంస్థ ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

దీనిపై చర్చించిన ప్రభుత్వం 1971లో కమిషన్ చేయబడిన రామగుండం థర్మల్ స్టేషన్ (ఆర్‌‌‌‌టీఎస్‌‌బీ)ని మూసివేస్తున్నట్లుగా ప్రకటిస్తూ విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ నెల 6న జీవో నంబర్ 58 రిలీజ్ చేశారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని జెన్‌‌కో సీఎండీని ఆదేశించారు. అయితే, ఈ ప్లాంట్ ప్రాంతంలోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్​ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 62.5 మెగావాట్ల  పవర్ ప్లాంట్ క్లోజ్ చేయడానికి చట్టపరమైన అనుమతులు రావడంతో, ఇక కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించిన పనులు స్పీడందుకోనున్నాయి.