రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది : కాసాని వీరేశం

రాష్ట్రం అప్పుల  కుప్పగా మారింది : కాసాని వీరేశం

పరిగి, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో పరిగి సెగ్మెంట్ ఎందుకు అభివృద్ధి కాలేదని టీడీపీ రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశం ప్రశ్నించారు.  పరిగి వాసులు ఈ విషయం గురించి ఆలోచించాలని కోరారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని శారద గార్డెన్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరేశం చీఫ్​ గెస్ట్​ గా హాజరై మాట్లాడారు. పరిగిలో ఎలాంటి ఉపాధి అవకాశాలు  కల్పించలేకపోయారన్నారు. బీఆర్ఎస్ నేతలు జనాలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుని నట్టేట ముంచారన్నారు.

బీఆర్ఎస్ సర్కారులో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఎస్సీలకు మూడెకరాల భూమి, అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల గుండెల్లో టీడీపీ పదిలంగా ఉందని, తెలంగాణలో మళ్లీ బలమైన శక్తిగా ఎదగాలని.. అందుకు కార్యకర్తలు  కష్టపడాలన్నారు. చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్ రెడ్డి, కార్యదర్శి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.