- నేటి నుంచి అధికారులకు ప్రత్యేక ఓరియంటేషన్ క్లాసులు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను ‘పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్ (పీడీపీ)’ల తయారీపై జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.దివ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ)లో నేటి నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు విడతల వారీగా ఈ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
జిల్లాల వారీగా అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు తేదీలను ఖరారు చేశారు. గురువారం నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, జనగాం జిల్లాల అధికారులకు శిక్షణ ఉంటుంది. రేపు మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులు హాజరుకావాలి. ఎల్లుండి ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల అధికారులకు క్లాసులు నిర్వహిస్తారు.
