- నిమ్స్ నుంచి జీవన్‌దాన్ ఆఫీస్ కూడా టిమ్స్‌కు తరలింపు
- ఇంకా ఇన్‌స్టాల్ చేయని హైఎండ్ ఎక్విప్‌మెంట్ కూడా..
- గాంధీలో నిర్మించిన 6 మాడ్యులర్ ఓటీలు హాస్పిటల్ అవసరాలకే..
- త్వరలోనే సర్కారు నుంచి జీవో
హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్‌లో ఏర్పాటు కావాల్సిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ (ఎస్ఓటీసీ) అడ్రస్ మారుతున్నది. ఈ సెంటర్‌ను సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ నిర్మాణం ఇప్పటికే పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. అక్కడ స్పేస్ ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయస్థాయిలో వసతులు కల్పించే అవకాశం ఉండటంతో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం నిమ్స్‌లో ఉన్న స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్ఓటీటీఓ–- జీవన్‌దాన్) ఆఫీసును కూడా సనత్‌నగర్ టిమ్స్‌కే మార్చనున్నారు.
దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. టిమ్స్‌లో అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దామోదర కూడా ఇటీవలే ప్రస్తావించారు. అయితే, గాంధీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఎస్ఓటీనే.. టిమ్స్‌కు తరలించనున్నట్లు తెలుస్తున్నది.
గాంధీలో మాడ్యులర్ ఓటీల ప్రారంభమెప్పుడో?
గాంధీలో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ల కోసం నిర్మించిన.. 6 ఆపరేషన్ థియేటర్లు నాలుగేండ్లు గడుస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, కొంత ఎక్విప్‌మెంట్ రెడీ చేసి ఏడాది అవుతున్నా.. మెడికల్ కార్పొరేషన్, గాంధీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదు. పేషెంట్లను తీసుకెళ్లే డెడికేటెడ్ లిఫ్ట్ కోసం చేసిన సాయిల్ టెస్ట్ ఫెయిల్ కావడంతో.. మరో స్థలంలో నిర్మించాలని అనుకున్నారు.
లిఫ్ట్ విషయమై దాదాపు ఏడాది నుంచి ప్రారంభం పెండింగ్‌లో పడుతూ వస్తున్నది. దీనిపై గాంధీ అధికారులు స్పందిస్తూ.. త్వరలోనే ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తామని క్లారిటీ ఇచ్చారు. లిఫ్ట్ కోసం ఇప్పటికే కొటేషన్ తెప్పించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ థియేటర్లలో ఆక్సిజన్ పైపులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలను గుర్తించామని, వాటిని పరిష్కరించి సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు.
గాంధీ ఓటీలు గాంధీకే.. మిషన్లు మాత్రం టిమ్స్‌కు..
గాంధీలో ట్రాన్స్‌ప్లాంట్ కోసం నిర్మించిన 6 అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను అక్కడి జనరల్ సర్జరీలు, ఇతర అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. అయితే, ఆ 6 మాడ్యులర్ ఓటీల్లో ఇప్పటికే ఎక్విప్‌మెంట్‌ను ఇన్‌స్టాల్ చేశారు. హార్ట్ లంగ్ మిషన్, ఎక్మో, సీ– ఆర్మ్, అనస్థీషియా వర్క్ స్టేషన్లు, హైఎండ్ వెంటిలేటర్లు, సీఆర్ఆర్టీ మిషన్లు.. తదితర ఎక్విప్‌మెంట్‌ను ఇంకా ఇన్‌స్టాలేషన్ చేయలేదు. బాక్సుల్లోనే ఉన్న ఖరీదైన హైఎండ్ ఎక్విప్‌మెంట్‌ను మాత్రం సనత్‌నగర్ టిమ్స్‌కు తరలించనున్నారు.
ప్రస్తుతం గాంధీలో ఉన్న ఆపరేషన్ థియేటర్ల కంటే టిమ్స్‌లో ఎక్కువగా ఉన్నాయని, అవి కూడా గాంధీతో పోలిస్తే అత్యంత విశాలంగా నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. గాంధీతో పోలిస్తే టిమ్స్ లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తు అవసరాలకు కూడా ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
