అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలే?

అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలే?
  • కేటీఆర్​పై రాష్ట్ర సర్పంచుల సంఘం ఫైర్

బషీర్ బాగ్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సర్కారు సర్పంచులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం ఫైర్ అయింది. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తమను వాడుకుంటున్నారని మండిపడింది. గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆ సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్  మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తమ సమస్యలు పట్టించుకోలేదుగానీ, ఇప్పుడు పోరాడుతానని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పిం చలేదన్నారు. సర్పంచ్​లను అణిచివేశారని, సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్​ల కుటుంబాలను కేటీఆర్ పరామ ర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సంఘం మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. గ్రామాల్లో చేయించిన పనులకు బిల్లులు రాక 12,765 మంది సర్పంచులు అప్పుల పాలయ్యారని తెలిపారు.