చదువుతో సమాజంలో మార్పు తథ్యం

చదువుతో సమాజంలో మార్పు తథ్యం

హైదరాబాద్: చదువు ద్వారా మాత్రమే సమాజంలో మార్పు వస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురుధర్మ ప్రచారణ సభ, శ్రీనారాయణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ శ్రీనారాయణ గురు స్టడీస్ ఆధ్వర్యంలో ‘ శ్రీ నారాయణ గురూస్ విజన్ ఆఫ్ రిలీజియన్ అండ్ సోషల్ జస్టిస్​’ అనే అంశంపై శనివారం రవీంద్ర భారతిలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమసమాజ స్థాపన కోసం నారాయణగురు తన జీవితమంతా పోరాడారని పేర్కొన్నారు. నారాయణగురు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. కులం, మతం, వర్గం పేరుతో ప్రజలు కొట్టుకున్నంత కాలం దేశం అభివృద్ధి పథంలో సాగడం కష్టమన్నారు. కానీ దురదృష్టవశాత్తు నేటి రాజకీయాలు వాటి చుట్టే తిరుగుతున్నాయని తెలిపారు. అధికారంలోకి రావడానికి రాజకీయ నాయకులు వీటి చుట్టే తిరుగుతున్నారని మండిపడ్డారు. 

పాలకుల ఆచరణ లోపం వల్లే..

సమాజంలోని పీడిత వర్గాలకు న్యాయం చేయాలంటే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారని, కానీ ఎన్ని చట్టాలు చేసినా ఆ వర్గాల్లో మార్పు రావడంలేదని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పాలకుల ఆచరణలోపం వల్లే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, వర్గాలుగా విడిపోయి ఉన్నంత కాలం పీడితవర్గాలన్నీ బానిస జీవితాలను గడపాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులైనప్పుడే పాలకుల్లో మార్పు వస్తుందని చెప్పిన మంత్రి... అందుకు చదువు ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు.