
ఎల్బీ నగర్, వెలుగు : సీఎం కేసీఆర్కు బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉండా లని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బ్రాహ్మణులకు ఎక్కడ ఎం జరిగినా బీఆర్ఎస్ తరపున ముందుండి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఎక్కడ అవకాశం ఉన్నా వారికి టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బ్రహ్మ గర్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని బ్రాహ్మణులు ఆశీర్వదించాలని కోరారు. అర్చక స్వాములకు ప్రభుత్వం జీతాలు ఇస్తున్నదని, ధూపదీప నైవేద్యాలకు నిధులు సమకూరుస్తున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ సర్కారు రూ.2 వేల కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నది. బోనాల నిర్వహణ కోసం ఏటా డబ్బులు ఇస్తున్నది. విదేశాల్లో హయ్యర్ స్టడీస్ కు వెళ్లాలనుకునే పేద బ్రాహ్మణ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నం. 60 ఏండ్లలో ఎప్పుడూ లేనివిధంగా యాదాద్రి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు” అని కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య హైదరాబాద్ అధ్యక్షుడు తులసి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్చక, పౌరోహిత్యాన్ని బ్రాహ్మణుల కులవృత్తిగా ప్రకటించాలని కోరారు. చట్టసభల్లో కనీసం 10 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు, 5 ఎంపీ సీట్లతో పాటు రెండు మంత్రిపదవులు ఇవ్వాలని ఆయన అన్నారు. వేదవిద్యను ప్రోత్సహించడానికి వేదిక్ యూనివర్సిటీ స్థాపించాలన్నారు.