జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మున్సిపల్ ఫలితాల తర్వాతే..!అధికార పార్టీకి అనుకూలంగా వస్తే వెంటనే ఎన్నికలకు

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్  మున్సిపల్ ఫలితాల తర్వాతే..!అధికార పార్టీకి అనుకూలంగా వస్తే వెంటనే ఎన్నికలకు
  • రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపోల్స్? 
  • రిజల్ట్స్​తర్వాతే  వార్డులు, ఇద్దరు మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలనుకున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టే రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆ  ఫలితాలు అనుకూలంగా వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల నగారా మోగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏప్రిల్ లేదా మే నెలలోగ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు మరో 22 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

ఫిబ్రవరి11 నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన మొదలుకానున్నది. అదే రోజు మూడు కార్పొరేషన్ల గెజిట్ కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. తర్వాతే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నారు. మున్సిపల్​ఎన్నికల అనంతరమే 300 వార్డులతో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాగిజిరి  కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్​స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి...

ప్రస్తుత జీహెచ్ఎంసీ (ఓఆర్ఆర్)పరిధిలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపల్ వార్డుల్లో ఇప్పటి నుంచే ఆశావహులు ఉనికిని చాటుకుంటున్నారు. ఇదివరకు పదుల సంఖ్యల్లో సీట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు గ్రేటర్ లో విలీనం కావడంతో ఒకటి, రెండు కొన్ని కార్పొరేషన్లలో ముగ్గురు కార్పొరేటర్లకి మాత్రమే అవకాశం ఉంది. దీంతో టికెట్ల కోసం లాబీయింగ్​మొదలుపెట్టారు. టికెట్ రాదని కన్ఫమ్​గా తెలిసిన వారు పార్టీలను సైతం మారుతున్నారు. మాజీ కార్పొరేటర్లు, లీడర్లు ఉదయాన్నే బస్తీల్లో తిరుగుతూ ప్రజలతో కలిసి ఛాయ్ తాగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నాయకుల భారీ కటౌట్లు గల్లీ గల్లీలో వెలుస్తున్నాయి. తమ వార్డులో జరిగిన అభివృద్ధి పనులను వీడియోల రూపంలో వైరల్ చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు.