డాలర్ మారకంలో రూపాయి విలువ 81.94

డాలర్ మారకంలో రూపాయి విలువ 81.94

ముంబై: మెటల్‌‌, ఐటీ, క్యాపిటల్ గూడ్స్‌‌  షేర్లు పెరగడంతో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు వరసగా రెండో సెషన్‌‌లోనూ లాభపడ్డాయి. సెన్సెక్స్‌‌, నిఫ్టీలు  ఇంట్రాడే లాభాలను కోల్పోయినా పాజిటివ్‌‌గా ముగియగలిగాయి.  30 షేర్లు ఉన్న సెన్సెక్స్‌‌ గురువారం 157 పాయింట్లు (0.27 శాతం) పెరిగి 58,222 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్‌‌ 58,579 వరకు  పెరిగింది. నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 17,332 వద్ద సెటిలయ్యింది.

ఆయిల్ ధరలు పెరుగుతున్నా, గ్లోబల్ మార్కెట్‌‌లు మిశ్రమంగా కదిలినా దేశ మార్కెట్‌‌లు పాజిటివ్‌‌గా ట్రేడయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు కూడా మార్కెట్ ర్యాలీకి సపోర్ట్ చేశారని వివరించారు.  మెటల్‌‌, ఐటీ, రియల్టీ  కంపెనీల క్యూ2 రిజల్ట్స్‌‌ మెరుగ్గా ఉంటాయనే అంచనాలతో ఈ కంపెనీల షేర్లు పెరిగాయని అన్నారు. ‘యూరప్ మార్కెట్‌‌లు బలహీనంగా ఉండడంతో పాటు ఎస్‌‌జీఎక్స్ నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకోవడంతో ఇన్వెస్టర్లు తమ కొనుగోళ్లను తగ్గించేసుకున్నారు.

ఐటీ, మెటల్‌‌, రియల్టీ షేర్లలో  కొనుగోళ్లు పెరగడంతో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు లాభాల్లో క్లోజయ్యాయి’ అని  కోటక్ సెక్యూరిటీస్‌‌  ఎనలిస్ట్‌‌ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. అయినప్పటికీ  గ్లోబల్‌‌గా ఇన్‌‌ఫ్లేషన్ ఎక్కువగా ఉందనే ఆందోళనలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయని తెలిపారు. 

బ్రాడ్ మార్కెట్ చూస్తే బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ గురువారం 1.3 శాతం పెరగగా, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్‌‌ 1.13 శాతం లాభపడింది. సెక్టార్ల పరంగా చూస్తే బీఎస్‌‌ఈ  మెటల్‌‌, క్యాపిటల్ గూడ్స్‌‌, రియల్టీ, ఇండస్ట్రియల్స్‌‌, కమొడిటీస్‌‌, పవర్ ఇండెక్స్‌‌లు ఎక్కువగా లాభపడ్డాయి. ఎఫ్‌‌ఎంసీజీ, టెలికమ్యూనికేషన్ షేర్లు మార్కెట్‌‌ను కిందకి లాగాయి. సియోల్‌‌, టోక్యో మార్కెట్‌‌లు లాభాల్లో ముగియగా, షాంఘై, హాంకాంగ్‌‌ మార్కెట్‌‌లు నష్టాల్లో క్లోజయ్యాయి. యూరప్‌‌లోని మెజార్టీ మార్కెట్‌‌లు నెగెటివ్‌‌లో కదిలాయి.  డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 32 పైసలు తగ్గి 81.94 వద్ద సెటిలయ్యింది.