సంగమేశ్వరం పనులు ఆపాలని ఆదేశించినం

సంగమేశ్వరం పనులు ఆపాలని ఆదేశించినం

సీఎం కేసీఆర్ కు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ లెటర్

పర్మిషన్ తీసుకున్నాకే ప్రాజెక్టుల పనులు చేపట్టాలి

కాళేశ్వరం థర్డ్ టీఎంసీ పనులకు కూడా అనుమతులు తప్పనిసరి

హైదరాబాద్‌, వెలుగు: సంగమేశ్వరం లిఫ్ట్‌, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టులు ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని తాము ఆదేశించామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. డీపీఆర్‌లు ఇచ్చి, అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుల పనులు చేపట్టాలని రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో క్లారిటీ ఇచ్చామని చెప్పారు. కాళేశ్వరం థర్డ్‌ టీఎంసీకి అన్ని పర్మిషన్లు తప్పనిసరి అని తేల్చిచెప్పారు. రివర్‌ బోర్డులకు జ్యూరిస్‌డిక్షన్‌ నోటిఫై అయితే.. ఆ తర్వాత నీళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తవని అన్నారు. ఆదివారం ఈమేరకు సీఎం కేసీఆర్‌కు షెకావత్‌ లెటర్ రాశారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి ముందు అక్టోబర్‌ రెండో తేదీన కేసీఆర్‌ రాసిన లెటర్‌కు రిప్లయ్‌ ఇచ్చారు.

మీరూ అట్లనే చేస్తున్నరు

‘‘ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని వాదిస్తున్న తెలంగాణ.. శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌ ద్వారా కూడా అదే రీతిన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తోంది. నాగార్జునసాగర్‌ దిగువన ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు కోటి మందికి తాగునీటిని ఇవ్వడానికి శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ పరిధిలోకి తేవాలని కోరారు. అది సాధ్యం కాదు” అని కేంద్ర మంత్రి షెకావత్ తేల్చిచెప్పారు.

పర్మిషన్లు వచ్చే దాకా ఏడు ప్రాజెక్టులు ఆపండి

గోదావరిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు ఆపాలంటూ అభ్యంతరం చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోందని షెకావత్ తెలిపారు. కాళేశ్వరం నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేందుకు మాత్రమే అనుమతులున్నాయని, అయినా తెలంగాణ ప్రభుత్వం మూడో టీఎంసీని తరలించే పనులు చేపట్టిందని గుర్తు చేశారు. రాష్ట్ర అవసరాల కోసం, ప్రాజెక్టుల ద్వారా అదనపు ప్రయోజనం పొందడానికే ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల లొకేషన్‌ మార్చినట్టుగా తమ దృష్టికి తీసుకువచ్చారని, ఇలా లొకేషన్‌ మార్చిన ప్రాజెక్టులన్నీ కొత్తవేనని తెలిపారు. కాళేశ్వరం అడిషనల్‌ టీఎంసీ పనులకు అన్ని అనుమతులు తీసుకోవాలని ఆగస్టు 7న తాను లెటర్ రాశానని చెప్పారు. కాళేశ్వరం థర్డ్‌ టీఎంసీతో పాటు సీతారామ, దేవాదుల ఫేజ్‌-3, తుపాకులగూడెం, మిషన్‌ భగీరథ (గోదావరి), లోయర్‌ పెన్‌గంగా బ్యారేజీ, రామప్ప నుంచి పాకాల డైవర్షన్‌ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకునే వరకు పనులు నిలిపివేయాలన్నారు. రెండు రాష్ట్రాలు కోరితే గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని షెకావత్ చెప్పారు.