స్ట్రీమ్​ ఎంగేజ్

స్ట్రీమ్​ ఎంగేజ్

ప్రేమ- పంతం

టైటిల్: వాసి, కాస్టింగ్​​: టొవినో థామస్, కీర్తి సురేష్, అను మోహన్, కొట్టాయం రమేష్, మాయా విశ్వనాథ్, డైరెక్షన్: విష్ణు రాఘవ్
ప్లాట్‌‌ఫామ్: నెట్‌‌ఫ్లిక్స్
లాంగ్వేజ్: మలయాళం, తెలుగు, తమిళం

లాయరు వృత్తిలో ఉన్న భార్యాభర్తలిద్దరూ ఒకే కేసును వాదిస్తూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ఈ కథ. ఇది బాపూ తీసిన రాధాగోపాళాన్ని గుర్తు చేస్తుంది.  కథ విషయానికొస్తే..  అడ్వకేట్ ఎబిన్(టొవినో థామస్), అడ్వకేట్ మాధవి(కీర్తి సురేష్)లు కేసుల కోసం చూస్తుంటారు. ఒక సీనియర్ లాయర్ సలహాతో ఇద్దరూ కలిసి ఒకే ఆఫీస్‌‌ను పంచుకుని పనిచేస్తుంటారు. ఎబిన్ బావకు మంచి పలుకుబడి ఉండడంతో అతనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యే అవకాశం దక్కుతుంది. మరోపక్క  ఎబిన్, మాధవిల మధ్య ప్రేమను తెలుసుకున్నపెద్దలు వాళ్లకి పెండ్లి చేస్తారు. 

పెండ్లి కంటే ముందు నుంచే వీళ్లిద్దరూ ఒకే కేసుని వాదిస్తుంటారు. గౌతమ్ అనే అబ్బాయి.. అనూష అనే అమ్మాయిని నమ్మించి మోసం చేశాడనే కేసులో అబ్బాయి తరఫున మాధవి, అమ్మాయి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎబిన్ వాదిస్తుంటారు. మాధవిని ఎబిన్ పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని అతని బావ, ‘కేసు ఓడిపోయి పెళ్లాంచాటు మొగుడు’ అని పేరు తెచ్చుకోకు అని అంటాడు. దాంతో ఎబిన్ ఛాలెంజ్‌‌గా తీసుకుంటాడు. ఆ మాట విన్న మాధవి కూడా కేసును  ఓ సవాల్ గానే తీసుకుంటుంది. ఇద్దరూ పంతంతో సవాళ్ళు విసురుకుంటారు. ఇంతకీ కేసు ఎవరు గెలిచారు అన్నది మిగిలిన కథ.

వాసి అంటే పంతం అని అర్థం. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అనే భావనతో మాధవి, అమ్మాయికి న్యాయం జరగాలన్న పట్టుదలతో ఎబిన్.. ఇద్దరూ సినిమా టైటిల్‌‌కు తగ్గట్టుగా పంతానికి పోయి వాదిస్తుంటారు. లాయర్ మాధవిగా కీర్తి సురేశ్, ఎబిన్‌‌గా టొవినో థామస్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కోర్టు రూమ్ సన్నివేశాల నుంచి, హీరో హీరోయిన్ మధ్య సాగే సన్నివేశాల వరకూ అన్నీ రియలిస్టిక్‌‌గా ఉండేలా దర్శకుడు జాగ్రత్త తీసుకున్నాడు. సినిమా అంతా మలయాళీ ఫ్లేతవర్‌‌‌‌లో చాలా సహజంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఉండే ఇగో, ప్రేమ, మరోపక్కన రక్తికట్టించే కోర్టు డ్రామా కోసం ఈ సినిమాను చూడొచ్చు.

ట్రిపుల్ యాక్షన్ డ్రామా

టైటిల్: శూర్‌‌‌‌వీర్, కాస్టింగ్: రెజీనా కసాండ్రా, మర్కంద్ దేశ్‌‌పాండే, అర్మాన్ రల్హాన్, ఆదిల్ ఖాన్, అభిషేక్ సాహా, డైరెక్షన్: కనిష్క్ వర్మ
ప్లాట్‌‌ఫామ్: డిస్నీ హాట్‌‌స్టార్, లాంగ్వేజ్: హిందీ

దేశానికి ఎదురయ్యే సెక్యూరిటీ బెదిరింపులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు త్రివిధ దళాలు కలిసి ‘ఎలైట్ టాస్క్‌‌ఫోర్స్’ అనే స్పెషల్ ట్రూప్‌‌ను ఏర్పాటు చేస్తాయి. గ్రౌండ్ మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బృందాలు కలిసి రకరకాల ఆపరేషన్స్‌‌ను ఎలా ఎదుర్కొన్నాయి అనేదే ఈ సిరీస్‌‌లోని కథ. మిలటరీ నేపథ్యంలో ఇప్పటికీ చాలా కథలు వచ్చినా.. ఇందులో త్రివిధ దళాలు కలిసి పనిచేయడం అనేది కొత్తవిషయం. ఈ సిరీస్‌‌ కథనం రొటీన్‌‌గా అనిపించినప్పటికీ.. కథలోని పాత్రలు, వారి మధ్య ఎమోషన్స్ బలంగా రాసుకున్నాడు దర్శకుడు. ఎలైట్ టాస్క్‌‌ఫోర్స్ అనే మిలటరీ గ్రూప్ జర్నీ, వారి మధ్యన ఏర్పడే రిలేషన్స్, త్రివిధ దళాలు దేశాన్ని ఏ విధంగా రక్షించాయి అనే విషయాలు ఈ వెబ్ సిరీస్‌‌లో ఎక్స్‌‌పీరియెన్స్ చేయొచ్చు.  గ్రౌండ్, ఎయిర్, సీ లెవల్‌‌లో అద్భుతంగా చిత్రీకరించిన యాక్షన్స్ సీక్వెన్స్ ఈ సిరీస్‌‌కు హైలైట్. మొత్తంగా యాక్షన్, ఎమోషన్స్‌‌తో కూడిన ఇంటెన్స్ డ్రామాగా శూర్‌‌‌‌వీర్‌‌‌‌ను చెప్పొచ్చు. 


ఎమోషనల్ ఫన్ రైడ్

టైటిల్: మా నీళ్ల ట్యాంక్, కాస్టింగ్​​: సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, 
నిరోష, డైరెక్షన్​:  లక్ష్మీ సౌజన్య, ప్లాట్‌‌ఫామ్: జీ ఫైవ్, లాంగ్వేజ్: తెలుగు

రాయలసీమలోని  బుచ్చివోలు గ్రామంలో పనీ పాటా లేకుండా తిరిగే సర్పంచ్‌‌ కొడుకు గోపాళం.. సురేఖ (ప్రియా ఆనంద్‌‌)ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌‌ అవుతాడు. అది ఇష్టంలేని సురేఖ ఇంటి నుంచి పారిపోతుంది. దాంతో గోపాళం ఆ ఊరినీళ్ల ట్యాంక్‌‌ ఎక్కి .. ‘సురేఖతో పెళ్లి చేస్తేనే కిందకు వస్తా’ అంటూ డిమాండ్‌‌ చేస్తాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎస్‌‌ఐ వంశీ (సుశాంత్‌‌) రంగంలోకి దిగుతాడు. మరి అతను సురేఖను వెతికి తీసుకొచ్చాడా లేదా? గోపాళం పెళ్లి సంగతి ఏమైంది? అనేది మిగిలిన కథ.

టైటిల్‌‌కు తగ్గట్టుగా ఈ కథలో  నీళ్ల ట్యాంక్ అంతగా హైలైట్ అవ్వలేదు.  ఊర్లో పనికిరాకుండా పడిఉన్న నీళ్ల ట్యాంక్‌‌తో.. బుచ్చివోలు గ్రామ ప్రజలకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అక్కడక్కడ చూపించారు అంతే. ఇకపోతే సురేఖ, వంశీల మధ్య సాగే లవ్ స్టోరీ రొటీన్‌‌గా అనిపిస్తుంది. సురేఖ కుటుంబంలో ఉండే సమస్య కూడా ఎన్నో కథల్లో చూసిందే. తెలిసిన కథకు కొత్త హాస్యాన్ని జోడించి ‘నీళ్ల ట్యాంక్’ నింపే ప్రయత్నం చేశారు. రాయలసీమ యాసలో సుశాంత్‌‌,  ప్రియా ఆనంద్‌‌ చక్కగా అలరించారు. సుదర్శన్‌‌ కామెడీ సిరీస్‌‌కు ప్రధాన బలం. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మొత్తానికి ఈ కథ రొటీన్‌‌గా అనిపించినా.. కామెడీతో పాటు కొన్ని ఎమోషన్స్ బాగా పండాయని చెప్పొచ్చు.