హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ఏ ఆర్టీవో ఆఫీసులోనైనా ఏజెంట్లు, బ్రోకర్లు కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (జేటీసీ) చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో కానిస్టేబుల్ నగదు లెక్కిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీవో ఆఫీసుల్లో బ్రోకర్ల సంచారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి నేరుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఇందులో భాగంగానే బుధవారం ఆయన హైదరాబాద్‌లోని ఉప్పల్ ఆర్టీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల నిర్వహణ తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. ఆఫీసుకు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ప్రతి ఆర్టీవో ఆఫీసు ప్రధాన గేటు ముందు, కౌంటర్ల వద్ద ఏజెంట్లకు అనుమతి లేదనే బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. వాహనదారులు నేరుగా ఆఫీసుకు వచ్చి అధికారులను సంప్రదించాలని, లేదంటే ఆన్‌లైన్ సేవలైన 'వాహన్', 'సారథి' సేవలను వినియోగించుకోవాలని జేటీసీ సూచించారు.
