జగిత్యాల: తెలంగాణలో అకాల వర్షాలు రైతన్నలను ఆగమాగం చేశాయి. జగిత్యాల జిల్లాలో అకాల వర్షానికి మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న, వరి తడిసిపోయాయి. సమయానికి తూకం వెయ్యకపోవడంతో అకాల వర్షానికి పంట ఆగమైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అధికారులు ప్లాస్టిక్ కవర్లను ఇవ్వడం లేదని, తూకమైన ధాన్యాన్ని నింపడానికి సంచులను అధికారులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్, కడెం, జన్నారం మండలంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా దస్తురాబాద్ మండలంలో పంటకల్లాలపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలో అకాల వర్షం రైతన్నకు కన్నీళ్లను మిగిల్చింది. ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. జగిత్యాల మార్కెట్ యార్డ్లో మొక్కలు, వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. జగిత్యాల-నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. కాంటావేసిన మొక్కజొన్నను తరలించాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని రైతులు డిమాండ్ చేశారు.
►ALSO READ | డ్రై ఫ్రూట్ హౌస్ షాపులో డ్రై ఫ్రూట్స్ కొంటున్నారా..? మల్లాపూర్ లో ఏం జరిగిందో చూడండి..!
నిర్మల్ జిల్లా కడెం మండలం అంబర్పేట్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో వానకు తడుస్తున్న ధాన్యానికి కవర్లను కప్పడానికి రైతు బైక్పై వెళుతున్నాడు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం కనబడకపోవడంతో ఎదురెదురుగా ఢీకొని కిందపడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
