బెల్లంపల్లి, వెలుగు : కడుపునొప్పితో విద్యార్థి చనిపోయిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. నెన్నెల ఎస్ఐ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. మండలంలోని అవుడం గ్రామానికి చెందిన బేతు కుమారస్వామి, శకుంతల దంపతుల కొడుకు వర్షిత్సాయి(14) తొమ్మిదో తరగతి చదువుతుండగా మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాడు. అనంతరం అదే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి బాగరా అన్నం, కోడి కూరతో తిని వెళ్లిపోయాడు.
రాత్రి ఇంట్లో పప్పుతో అన్నం తిని నిద్రపోయాడు. తెల్లవారుజామున 3 గంటలకు తీవ్ర కడుపునొప్పి వస్తుందని వర్షిత్ పేరెంట్స్ కు చెప్పడంతో స్థానిక పీఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించారు. మెరుగైన వైద్యానికి కరీంనగర్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గ మధ్యలో వర్షిత్ చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
