భారతదేశ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలో ఎప్పుడు పెద్ద మార్పులు వచ్చినా.. సామాజిక సంస్కరణలు చోటు చేసుకున్నా.. ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడినప్పుడు వాటిని కాపాడేందుకు ముందుకు వచ్చినా.. ప్రతి సందర్భంలో విద్యార్థి సమాజం కీలక పాత్ర పోషించింది. యువతలోని ఆవేశం, ఆలోచన, ఆదర్శం, సమాజం పట్ల బాధ్యత.. ఇవన్నీ కలిసినప్పుడే విద్యార్థి ఉద్యమాలు రూపుదిద్దుకుంటాయి.
అందుకే విద్యార్థి ఉద్యమాలు కేవలం కళాశాలల గోడల మధ్య జరిగే నిరసనలు కావు. అవి దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తులు. విద్యార్థి అంటే కేవలం పరీక్షలు రాసే వ్యక్తి కాదు. రేపటి పౌరుడు. రేపటి శాస్త్రవేత్త. రేపటి ఉపాధ్యాయుడు. రేపటి న్యాయమూర్తి. రేపటి పరిపాలకుడు. రేపటి ప్రజాప్రతినిధి. అలాంటి విద్యార్థి తన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని భావించినప్పుడు ఉద్యమం చేయడం సమాజం పట్ల అతని బాధ్యత కూడా.
భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మొదలుకొని నేటి వరకు విద్యార్థుల పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుకు స్పందించి వేలాది మంది విద్యార్థులు తమ చదువులను పక్కనపెట్టి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాసినప్పుడు కూడా విద్యార్థులే ముందుండి పోరాడారు.
తెలంగాణ చరిత్రలో కూడా విద్యార్థుల పాత్రను విస్మరించలేం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా మారాయి. వేలాది మంది విద్యార్థులు తమ చదువులు, ఉద్యోగ అవకాశాలను పక్కనపెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. వారి త్యాగాలు, ఆవేదన, పోరాట పటిమ లేకపోయి ఉంటే తెలంగాణ ఆవిర్భావ చరిత్ర మరోలా ఉండేదనే విషయాన్ని ఎవరూ ఖండించలేరు.
పేపర్ లీకేజీలతో.. కూలిపోతున్న నమ్మకం
ఇటీవలి కాలంలో దేశాన్ని తీవ్రంగా కలవరపరిచిన అంశం పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు. ముఖ్యంగా నీట్, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో చోటుచేసుకున్న లీకేజీలు లక్షలాది మంది విద్యార్థుల ఆశలను దెబ్బతీశాయి. ఒక విద్యార్థి పోటీ పరీక్ష కోసం రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు శ్రమిస్తాడు. రోజుకు పది గంటలు, పన్నెండు గంటలు చదువుతాడు. కుటుంబం అప్పులు చేసి కోచింగ్‌కు పంపిస్తుంది. తల్లిదండ్రులు తమ జీవిత పొదుపులన్నీ పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తారు. చివరకు పరీక్ష రాసే సమయానికి ప్రశ్నపత్రం ముందే బయటకు వచ్చిందని తెలిసినప్పుడు ఆ విద్యార్థి మనసులో కలిగే వేదనను మాటల్లో చెప్పలేం.
పేపర్ లీకేజీ అంటే కేవలం ఒక పరీక్ష రద్దు కావడం కాదు. అది లక్షలాది మంది విద్యార్థుల కష్టం మీద నీళ్లు చల్లడం. నిజాయితీగా చదివిన విద్యార్థికి అన్యాయం చేయడం. ప్రతిభను అవమానించడం. దేశ విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు.
ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఢిల్లీలో నిర్వహించిన 'చలో పార్లమెంట్' కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాదిమంది విద్యార్థులు ఒకే వేదికపై చేరి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. లాఠీచార్జీలు చేసినా.. గాయాలైనా.. వెనక్కి తగ్గకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను కొనసాగించారు. వారి డిమాండ్లు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కావు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల కష్టానికి న్యాయం జరగాలని.
ఉద్యమాలే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం
విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం సమస్యకు పరిష్కారం కాదు. వారి మాట వినడం, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడం, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ప్రభుత్వాల బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎంత ముఖ్యమో.. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో శాంతియుత ఉద్యమాలు వ్యవస్థకు శత్రువులు కావు. అవే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం. ప్రజల సమస్యలు అధికారుల చెవికి చేరే మార్గం ఉద్యమాలే. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రశ్నించే స్వరం బలంగా ఉండాలి. ఆ స్వరాన్ని అణచివేయడం కాదు.. ఆలకించడం పాలకుల ధర్మం.
విద్యార్థి ఉద్యమాలు రాజకీయాల కోసం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు కోసం సాగుతాయి. అవి విధ్వంసాన్ని కాదు.. సంస్కరణలను కోరుకుంటాయి. నేడు దేశానికి అవసరమైనది కేవలం కొత్త విశ్వవిద్యాలయాలు, కొత్త భవనాలు, కొత్త పథకాలు మాత్రమే కాదు. విద్యార్థుల్లో నమ్మకం పెంచే విద్యా వ్యవస్థ. ప్రతిభకు గౌరవం ఇచ్చే పరీక్షా విధానం. నిజాయితీని ప్రోత్సహించే పాలన.
విద్యార్థులు ఐక్యంగా, బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాడినప్పుడల్లా సమాజంలో మార్పు వచ్చింది. ప్రజాస్వామ్యం బలపడింది. సంస్కరణలు చోటుచేసుకున్నాయి. అందుకే విద్యార్థి ఉద్యమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం కన్నా.. వాటి వెనుక ఉన్న ఆవేదనను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించడం పాలకుల కర్తవ్యం.
పారదర్శకత లేకపోతే..దేశ భవిష్యత్తుకే ప్రమాదం
ఏ దేశమైనా తన విద్యా వ్యవస్థపైనే నిలబడుతుంది. విద్యార్థులు పరీక్షా వ్యవస్థను విశ్వసించలేని పరిస్థితి ఏర్పడితే అది కేవలం విద్యా రంగానికి మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తుకే ప్రమాదం. ప్రతి పేపర్ లీకేజీ వెనుక ఒక విద్యార్థి కల ఛిద్రమవుతుంది. ప్రతి అవకతవక వెనుక ఒక కుటుంబం ఆశలు కూలిపోతాయి. అందుకే ప్రభుత్వం ప్రతి ఆరోపణను అత్యంత బాధ్యతతో తీసుకోవాలి.
పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలి. పరీక్షా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా, సాంకేతికంగా మరింత బలోపేతం చేయాలి. విద్యార్థి ఉద్యమాలంటే కొందరు రాజకీయ కోణంలో మాత్రమే చూస్తుంటారు. కానీ చరిత్ర చెబుతున్న నిజం వేరే. విద్యార్థులు తమ హక్కులు, న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య కోసం పోరాడినప్పుడల్లా సమాజం లాభపడింది.త
- కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
