- ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫీజులను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఫీజుల పెంపు సామాన్య, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర అని విమర్శించాయి. వెంటనే పెంచిన ఫీజులను తగ్గించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడ్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, టి.నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇంజినీరింగ్ కు గరిష్టంగా రూ.1.83 లక్షలు, బీ ఫార్మసీకి రూ.1.21 లక్షలు, ఫార్మాడీకి రూ.1.37 లక్షలు, ఆర్కిటెక్చర్‌కు రూ.1.32 లక్షల వరకు ఫీజులు పెంచడం సరికాదన్నారు. ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో పెట్టి, మరోవైపు కాలేజీలకు ఫీజులు పెంచుకునే వెసులుబాటు కల్పించడం విద్యార్థి వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. ఫీజుల పెంపు నిర్ణయం వెనుక సీఎం రేవంత్ రెడ్డికి, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. గతంలో ప్రైవేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన సీఎం.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఫీజుల పెంపునకు అనుమతిచ్చారని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే జీవో 6, 10లను రద్దు చేసి, పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
