విద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలంటూ.. 

విద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలంటూ.. 

హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో అసలే కష్టాలతో సామాన్యుల నడ్డి విరిచేలా ఆర్టీసీ చార్జీలు పెంచడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీడీఎస్యూ జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో పెరిగిన విద్యార్థుల బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ ముందు ఇవాళ ధర్నా నిర్వహించారు. పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల బస్ పాస్ చార్జీ 195 రూపాయలు నుంచి ఏకంగా 450 రూపాయలకు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. 
పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థుల నిరసన, వ్యతిరేకతల గురించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారని పీడీఎస్ యూ నాయకుడు గడ్డం శ్యామ్ తెలిపారు.