సైఫాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నం.7ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గన్పార్క్ వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణలతో కలిసి మాట్లాడుతూ.. ఈ జీవో వల్ల సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత లేకపోవడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండటంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయన్నారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, విద్యా సంవత్సరంలో మూడు దఫాలుగా నిధులు జమ చేసేలా జీవోను సవరించి గ్రీన్ చానల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణతో పాటు నరసింహ నాయక్, సాయి, సానియా, ప్రత్యూష, వెన్నెల, అనూష, శృతి, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.
