- లెడ్, కాడ్మియం, మెర్క్యురీ, ఆర్సెనిక్ లాంటి హెవీ మెటల్స్
- వాహన, పరిశ్రమల కాలుష్యమే కారణం
- తెలంగాణ, ఏపీ హార్టికల్చర్ వర్సిటీల సంయుక్త స్టడీలో వెల్లడి
- ప్రసిద్ధ ‘జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్’లో ప్రచురితం
హైదరాబాద్, వెలుగు: హైవేల పక్కన పచ్చగా కనిపిస్తున్న పండ్ల తోటల వెనుక విషం దాగి ఉన్నది. ఈ తోటల్లోని పండ్లలో ప్రమాదకరమైన లోహాలు ఉన్నాయని స్టడీలో తేలింది. వాహనాల ఉద్గారాలు, పరిశ్రమల వ్యర్థాలు, టైర్లు, బ్రేకుల అరుగుదల, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన దహనం వల్ల విడుదలవుతున్న సీసం (లెడ్), కాడ్మియం, పాదరసం (మెర్క్యురీ), ఆర్సెనిక్, క్రోమియం వంటి భార లోహాలు గాలి, నేల, నీరులో కలసి పండ్ల తోటలను విషపూరితం చేస్తున్నాయి.ఏపీలోని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, తెలంగాణలోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రామాంజనేయ రెడ్డి, ఉన్నతి మధురి, చంద్రమోహన్ రెడ్డి, పరమేశ్వర్ బృందం సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన ఫలితాలు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ‘జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి. కాగా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) 2011 నివేదిక ప్రకారం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ దేశంలో ఉన్న భారీ లోహాల కలుషిత వ్యర్థాలలో 80% వాటా కలిగి ఉన్నాయి. ఈ వ్యర్థాలు పర్యావరణంలోకి చేరి పండ్లలోకి కూడా చొరబడుతున్నాయని తాజా పరిశోధన స్పష్టం చేసింది.
కారణాలివే..
స్టడీ ప్రకారం రోడ్ల పక్కనున్న తోటలు అత్యంత ప్రమాదకర స్థాయిలో భారీ లోహాల కాలుష్యానికి గురవుతున్నాయి. వాహనాల నుంచి వెలువడే పొగ, టైర్లు, బ్రేకుల నుంచి అరుగుతున్న లోహ ధూలి కణాలు గాలిలో వ్యాపించి పండ్లపై నేరుగా పేరుకుపోతున్నాయి. పరిశ్రమల ప్రాంతాల నుంచి వచ్చే రసాయన కణాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల కూడా ఈ లోహాలు నేలలోకి చొరబడి భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. వీటితో నేల రసాయన సమతుల్యత (పీహెచ్) మారిపోతూ సూక్ష్మజీవుల క్రియలను అడ్డుకుంటున్నది. ఫలితంగా చెట్లు పోషకాలు సరిగా గ్రహించలేక పండ్ల నాణ్యత దెబ్బతింటున్నది. ఇందుకు మైనింగ్, వాహన ఉద్గారాలు, సీవేజ్ ఇరిగేషన్, అట్మాస్పియర్ డిపాజిషన్ వంటి మానవ చర్యలే ప్రధాన కారణమని స్టడీలో తేలింది.
ఆరోగ్యానికి ముప్పు..
హెవీ మెటల్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తే కాలేయం, కిడ్నీలు, ఎముకల్లో పేరుకుపోయి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి. సీసం నాడీ వ్యవస్థను దెబ్బతీసి పిల్లల్లో మేధోపరమైన లోపాలు, పెద్దల్లో హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది. పాదరసం సెంట్రల్ నర్వ్స్ సిస్టమ్‌ను దెబ్బతీసి దృష్టి లోపాలు కలిగిస్తుంది. ఆర్సెనిక్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు, కాడ్మియం ఎముకల బలహీ నత, కిడ్నీ వైఫల్యానికి దారితీ స్తుంది. సైంటిస్టుల స్టడి ప్రకారం.. ఈ లోహాలు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ (ఆర్వోఎస్) ఉత్పత్తిని పెంచి మొక్కలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగిస్తాయి. ఎంజైమ్, కిరణజన్య సంయోగ క్రియలు దెబ్బతిని పండ్లలో చక్కెరలు తగ్గి, ఆమ్లత్వం పెరుగుతుంది. మామిడి పండ్లలో కాడ్మియం ప్రభావం అధికంగా ఉందని స్టడీలో తేలింది.
పరిష్కార మార్గాలివీ..
హైవేలు, పరిశ్రమ ప్రాంతాలకు 50 నుంచి100 మీటర్ల దూరంలో పండ్ల తోటలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కలుషి త నీటిని సాగుకు ఉపయోగించకూడదు. సేంద్రియ ఎరువులు, కంపోస్ట్, బయోచార్ వంటి సాయిల్ అమెండ్‌మెంట్స్ వాడాలి. ఫైటోరెమెడియేషన్ (సూర్యకాంతి, మస్టర్డ్ మొక్కలతో లోహాలను గ్రహించి తొలగిం చడం), కానోపీ మేనేజ్‌మెంట్, పీరియాడిక్ వాషింగ్ వంటి పద్ధతులు ఉపయోగకరమని స్టడీ సూచించింది. డబ్ల్యూహెచ్‌వో, ఎఫ్‌ఏవో ప్రమాణాలకు అనుగుణంగా నేల, నీరు, ఆకులు, పండ్లలో భారీ లోహాల స్థాయిలను పర్యవేక్షించడం అవసరమని శాస్త్రవేత్తలు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులు, రైతుల్లో అవగాహన కల్పించడంతోనే ఈ సమస్యను అధిగమించ వచ్చని నిపుణులు చెబుతున్నారు.
