అసంబద్ధ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి 

అసంబద్ధ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి 

ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్లపై కక్ష పూరిత చర్యలు వద్దని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై STUTS స్పందించింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేయడాన్ని ఎస్టీయూటీస్ తీవ్రంగా ఖండించింది. ఏ ఒక్కరినో సాకుగా చూపుతూ ఇలాంటి ఉత్తర్వులను విడుదల చేయడం ఉపాధ్యాయులను కించపరచడమేనని ఎస్టీయూటీస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వతరెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ పక్క పాఠశాలలల్లో మౌళిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులకు బదిలీలతో పాటు పదోన్నతులు చేపట్టాలని ఉద్యమ కార్యాచరణకు సన్నద్దమౌతున్న తరుణంలో ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు విడుదల చేయడం ఉద్యమాన్ని నిర్విర్యం చేయడమేనని పేర్కొంది. విద్యాశాఖ పరిధిలో పని చేసే ఉపాధ్యాయులు ఏటా మార్చిలో ఆదాయ వ్యయాలతో పాటు స్థిరచరాస్తుల వివరాలు సమర్పిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రభుత్వం ఇటువంటి అర్థరహితమైన ఉత్తర్వులు జారీ చేసింది.. ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికేనని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే  ఉత్తర్వులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.