సూర్యాపేట, వెలుగు: జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ ఐపాస్, టీ-ప్రైడ్ పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీజీ ఐపాస్ పోర్టల్ ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ పథకం కింద 25 యూనిట్లకు వివిధ శాఖల నుంచి మొత్తం 57 అనుమతుల కోసం దరఖాస్తులు అందాయని, వీటిలో 37 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామన్నారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం వేగంగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.హరి సింగ్, జీఎం ఇండస్ట్రీస్ భారతి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, ఎంఈఐ ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్ర సమీపంలోని కుడకుడ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, దీనికి కారకులైన బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణ్‌రావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
కుడకుడ గ్రామంలో సర్వే నంబర్ 126లోని విలువైన ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వ హయాంలో 14 మంది బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని వరుణ్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
