కవిత షెల్ అకౌంట్ల నుంచి మారిషస్ కంపెనీకి రూ.80 కోట్లు బదిలీ : సుఖేశ్ చంద్రశేఖర్

కవిత షెల్ అకౌంట్ల నుంచి మారిషస్ కంపెనీకి రూ.80 కోట్లు బదిలీ : సుఖేశ్ చంద్రశేఖర్

మరోసారి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు 
కేజ్రీవాల్ ఆదేశాలతోనే బదిలీ అయినట్లు లేఖ 

న్యూఢిల్లీ, వెలుగు : మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. కవితకు సంబంధించిన డిస్టిలింగ్ షెల్ అకౌంట్ల నుంచి మంత్రి కైలాస్ గెహ్లాట్ కజిన్​కు చెందిన ‘గ్రీన్ హస్క్’ ఇండస్ట్రీస్ (మారిషస్)కు కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు తెలిపాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు రూ.80 కోట్లు (25+25+30) ట్రాన్స్ ఫర్ చేసినట్లు సుఖేశ్ చెప్పాడు. ఈ డబ్బును యూఎస్ బీసీ, క్రిప్టో కరెన్సీకి మార్చిన అనంతరం కేజ్రీవాల్ సూచనల మేరకు అబుధాబికి పంపినట్లు పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ తో జరిపిన ‘ఫేస్‌‌ టైమ్’ చాట్‌‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్‌‌లను త్వరలో విడుదల చేస్తానన్నాడు. ఈ మేరకు సుఖేశ్ చంద్రశేఖర్ తన అడ్వకేట్ అనంత్ మాలిక్ ద్వారా బుధవారం నాలుగు పేజీల లేఖను రిలీజ్ చేశాడు.

ఈ లేఖలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై మరోసారి ఆరోపణలు చేశాడు. ఆ ఇంటి ఫర్నిచర్​కు అయిన ఖర్చును తానే భరించానని, అందుకు సంబంధించిన బిల్లులు కూడా తన దగ్గర ఉన్నాయన్నాడు. వాస్తవాలను బయటపెడుతున్నందుకే తనను జైలులో కొందరు అధికారుల ద్వారా మానసికంగా వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. త్వరలోనే కేజ్రీవాల్​కు సంబంధించిన మరో కుంభకోణాన్ని బయట పెడతానని, ఇందుకు సీఎం, ఆయన మిత్రులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు.