కవితక్కా..ప్యాకేజీ పంపిన! వాట్సాప్ చాట్ రిలీజ్​ చేసిన సుఖేశ్‌‌ చంద్రశేఖర్

కవితక్కా..ప్యాకేజీ పంపిన! వాట్సాప్ చాట్ రిలీజ్​ చేసిన సుఖేశ్‌‌ చంద్రశేఖర్

కవితక్కా..ప్యాకేజీ పంపిన!
వాట్సాప్ చాట్ రిలీజ్​ చేసిన సుఖేశ్‌‌ చంద్రశేఖర్
రూ.15 కోట్లను ముట్టజెప్పే విషయమై చర్చ
లాయర్ ద్వారా 6 పేజీల లేఖ విడుదల
దర్యాప్తు చేయాలంటూ సీజేఐ, కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ఎల్జీ, సీబీఐ, ఈడీలకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు : మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేశ్‌‌ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చేసినట్లుగా చెబుతున్న వాట్సాప్ చాట్​ను రిలీజ్ చేశాడు. రూ.15 కోట్లను ముట్టజెప్పే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేశానంటూ పలు స్ర్కీన్ షాట్లను షేర్ చేశాడు. అందులో కవిత పేరును ‘కవిత అక్క టీఆర్ఎస్’గా సేవ్ చేసుకున్నాడు.

బెంగళూరుకు చెందిన సుఖేశ్.. చాట్ సందర్భంగా ‘అక్కయ్య’, ‘అక్క’ అంటూ పలుమార్లు కవితను సంభోదించడం గమనార్హం. బుధవారం ఈ మేరకు 6 పేజీల లేఖను తన లాయర్ ద్వారా మీడియాకు విడుదల చేశాడు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రూ.15 కోట్లు ఇచ్చినట్లు మరోసారి చెప్పాడు.

ఆధారాలిస్త.. విచారణకు సహకరిస్త..

రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌‌ కేసులో అరెస్టయిన సుఖేశ్‌‌.. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. ఆప్‌‌ నేతలపై కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఎమ్మెల్సీ కవితకు డబ్బులు ఇచ్చినట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వాట్సాప్ చాట్ రిలీజ్ చేయటం దుమారం రేపుతోంది. ‘‘అన్నీ లావాదేవీల నోట్స్‌‌తో పాటు ఇతర చాట్‌‌లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఫిర్యాదులపై దర్యాప్తు చేయండి. విచారణకు పూర్తిగా సహకరిస్త. పలువురు ఆప్ నేతలతో జరిపిన మొత్తం 703 వాట్సాప్ చాటింగ్స్‌‌లో ప్రస్తుతం రిలీజ్ చేసినవి రెండు మాత్రమే’’ అని సుఖేశ్ పేర్కొన్నాడు. అర్వింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ నుంచి తనకు, తన కుటుంబానికి నిరంతరం ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.

హైదరాబాద్ నుంచి విదేశాలకు హవాలా

‘‘2020లో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రూ. 15 కోట్లను హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నా మనషుల ద్వారా ఇచ్చాను. ఇందుకు సంబంధించి నాకు ఎమ్మెల్సీ కవితకు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు మధ్య జరిగిన చాట్స్ ను పొందుపరిచాను. ఢిల్లీ లిక్కర్ లైసెన్సుల కోసం కె.కవితతో లావాదేవీలు జరిగాయి. ఆప్ కు అనుకూలంగా హైదరాబాద్ నుంచి హవాలా ద్వారా వివిధ ఆసియా దేశాలకు మనీ లాండరింగ్ జరిగింది. ఈ లావాదేవీలను.. ఢిల్లీ నుంచి కాకుండా, హైదరాబాద్ వేదికగా నిర్వహించారు” అని సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ‘‘ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న వ్యక్తులు, అవినీతి ఆరోపణలతో దర్యాప్తును ఎదుర్కొంటున్న వ్యక్తులకు, నాకు మధ్య జరిగిన చాటింగ్‌‌ల స్క్రీన్‌‌షాట్‌‌ల కాపీలను మీ దృష్టికి తెస్తున్నాను. ఇదే విషయాన్ని హై పవర్డ్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చాను. మనీలాండరింగ్ కు పాల్పడ్డ పలువురు నేతలకు సంబంధించి, విచారణకు ఉపయోగపడే ఆధారాల్లో నా దగ్గర ఉన్న 703 వాట్సాప్ చాటింగ్స్‌‌లో కొన్ని బయటపెడుతున్నా. అర్వింద్ కేజ్రీవాల్, ఆయన సహచరులు సౌత్ గ్రూప్, ఇండో స్పిరిట్, దాని యజమానులు అరుణ్ పిళ్లై, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కె కవిత లావాదేవీల అంశాన్ని ఇవి రుజువు చేస్తాయి. 2015 నుంచి నా ద్వారా వీరికి అనేక సార్లు మనీ ట్రాన్స్‌‌ఫర్ జరిగింది’’ అని ఆరోపించాడు.

కవితతో జరిపిన చాట్స్‌‌లో కోడ్స్ ఇలా..

ఏకే బ్రో అంటే అర్వింద్ కేజ్రీవాల్
ఎస్‌‌జే బ్రో అంటే సత్యేంద్ర జైన్
మనీశ్ అంటే మనీశ్ సిసోడియా
అరుణ్ అంటే అరుణ్ పిళ్లై
జేహెచ్‌‌ అంటే జూబ్లీహిల్స్
ఆఫీస్ అంటే టీఆర్ఎస్ హెడ్ ఆఫీసు
ప్యాకేజ్ అంటే రూ.15 కోట్ల నగదు

కవితతో జరిపినట్లు చెబుతున్న చాటింగ్ ఇదీ..

సుఖేశ్ : అక్క.. మీ నుంచి కొంత సమాచారం కావాలి
కవిత : హాయ్.. ఇప్పుడే నీ మెసేజ్ చూశాను
సుఖేశ్ : సమస్య లేదు అక్కయ్య. ఏకే బ్రో ప్యాకేజీ మీకు అప్పగించాలి. ఇది నాతో సిద్ధంగా ఉంది
కవిత : అవునా.. ఓకే
సుఖేశ్ : నేను జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్‌‌కు పంపనా?
కవిత : వద్దు వద్దు.. నేను అరుణ్‌‌తో మాట్లాడి కాల్ చేస్తాను. వాటిని ఆఫీసుకు పంపాలి.
సుఖేశ్ : మీరు ఎలా చెబితే అలా..
కవిత : అతను నిన్ను తొందర్లో చేరుకుంటారు
సుఖేశ్: తప్పకుండా అక్క.. సత్యేంద్ర జైన్ బ్రో ఈరోజే ఇది మీకు అందజేయమన్నారు
కవిత : అవును
సుఖేశ్: నేను అంతా సమన్వయం చేసుకుంటా అక్క
కవిత: అంతా ఓకేనా? మీ నాన్న ఎలా ఉన్నారు.
సుఖేశ్: అడిగినందుకు మీకు ధన్యవాదాలు. కీమో జరుగుతున్నది.
కవిత: ఆయన త్వరగా కోలుకోవాలి.
సుఖేశ్: థ్యాంక్స్ అక్క.. కేసీఆర్ సార్​కు నా అభినందనలు చెప్పండి
కవిత: సరే..
సుఖేశ్: అక్క ప్యాకేజీ ముట్టింది. దయచేసి కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ లకు సమాచారం ఇవ్వండి
కవిత: సత్యేంద్ర జైన్ తో మాట్లాడాను.
సుఖేశ్: సరే అక్క ధన్యవాదాలు.