V6 News

15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల బాలికలకు.. స్నేహ పేరుతో సమ్మర్ క్యాంప్స్

15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల బాలికలకు.. స్నేహ పేరుతో సమ్మర్ క్యాంప్స్
  • స్నేహ పేరుతో మే 2 నుంచి జూన్ 10 వరకు నిర్వహణ 
  • 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల బాలికలకు అవగాహన
  • బాల్య వివాహాలను అరికట్టడం, కెరీర్​ గైడెన్స్​ తదితర అంశాలపై శిక్షణ
  • చివరి రోజు గ్రామ సభలు
  • ఉత్తర్వులు జారీ చేసిన సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కిశోర బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వేసవి సెలవులను పురస్కరించుకుని 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల బాలికల కోసం స్నేహ పేరుతో సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మే 2 నుంచి జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ బుధవారం జారీ చేశారు.

బాలికలు చదువులో వెనకబడకుండా చూడటం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. వినోదమే కాకుండా.. జీవన నైపుణ్యాలు, భద్రత, సైబర్ నేరాలపై అవగాహన వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ల పర్యవేక్షణలో గురువారంలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఆర్డీవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సెర్ప్ తోపాటు వైద్యారోగ్య, ఐసీడీఎస్, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు కలిసి పని చేయనున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ వీవోఏలు సమన్వయంతో క్యాంప్​లను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

12 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు

సమ్మర్ క్యాంప్​లలో భాగంగా 12 రోజులపాటు ప్రత్యేక థీమ్‌‌లతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాలికల పరస్పర పరిచయం నుంచి ప్రారంభమై, బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన, ఎనీమియా వంటి ఆరోగ్య సమస్యలపై చర్చ, గ్రామ స్థాయిలో భద్రతా ప్రణాళికల రూపకల్పన, సామాజిక బాధ్యత పెంపు వంటి అంశాలను కవర్ చేస్తారు. ఆర్థిక నిర్వహణ, క్రీడలు, విద్య ప్రాముఖ్యత, కెరీర్ మార్గదర్శనం, సైక్లింగ్, ఇత‌‌ర‌‌ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

సేఫ్ విలేజ్ ప్లాన్ రూపకల్పన, షీ టీమ్స్ సహకారంతో భద్రతపై అవగాహన కల్పించనున్నారు. క్రీడలు, యోగా, స్మార్ట్ ఫోన్ల వినియోగం, సైబర్ భద్రత, ఉన్నత చదువులు, కెరీర్ గైడెన్స్ పై దిశానిర్దేశం చేయనున్నారు. శిబిరాల ముగింపు సందర్భంగా గ్రామస్థాయిలో బాలిక‌‌ల‌‌కు గ్రామసభలు నిర్వహించి బాల్య వివాహాలకు అడ్డుకట్ట, బాలికల భద్రత, విద్య కొనసాగింపు వంటి అంశాలపై తీర్మానం చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధిని ఎంపిక చేసి, జూన్ నెలలో రాష్ట్రస్థాయిలో చిల్డ్రన్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు.