
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రోగ్రామ్స్‌పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్, పార్టీ సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్‌లు ఆరా తీశారు. సోమవారం పార్టీ స్టేట్ ఆఫీస్‌లో వీరితో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల నియామకం, హైకమాండ్ ఆదేశించిన ప్రోగ్రామ్స్ కొనసాగింపు, పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయం వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు.. ఎన్నికలకు పార్టీ నేతలు, క్యాడర్‌ను సిద్ధం చేయడం వంటి విషయాలపై నేతల మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టండి
రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం బర్కత్ పురలోని బీజేపీ సిటీ ఆఫీస్‌లో సునీల్ బన్సల్ చర్చించారు. ఈ మీటింగ్‌కు మూడు ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ మూడు జిల్లాల్లో దీనిపైనే సీరియస్‌గా దృష్టి పెట్టాలని నేతలకు బన్సల్ సూచించారు. ప్రతీ ఓటర్ను కలిసేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు.