పది ఎంపీ సీట్లు గెలుస్తం.. హైకమాండ్ చెప్పినట్టు పని చేయాలి: సునీల్ బన్సల్

పది ఎంపీ సీట్లు గెలుస్తం.. హైకమాండ్ చెప్పినట్టు పని చేయాలి: సునీల్ బన్సల్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో పది స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి సునీల్ బన్సల్ ధీమా వ్యక్తం చేశారు. హైకమాండ్ చెప్పినట్టు ఎన్నికల కమిటీలు పని చేస్తే మెజార్టీ స్థానాల్లో గెలుస్తామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ మీటింగ్​కు చీఫ్ గెస్ట్​గా సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పది లోక్​సభ ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేసి.. పలు అంశాలపై వారు చర్చించారు. 3 కమిటీల చొప్పున మూడు దఫాలుగా భేటీ అయ్యారు. తర్వాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ కుమార్​తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్ మాట్లాడారు.

ఇప్పటి నుంచే బూత్ స్థాయిలోకి వెళ్లి ఆయా కమిటీలు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. సమాజంలోని వివిధ వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి కేంద్ర పథకాలు అందేలా చూడాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న సీట్లు సాధించడంలో ఇటీవల నియమించిన కమిటీల పాత్ర కీలకమని దిశా నిర్దేశం చేశారు. కాగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం ముగియనుంది.