నిరుద్యోగుల కోసమే విద్యార్థుల రాజకీయ పార్టీ : సునీల్

నిరుద్యోగుల కోసమే విద్యార్థుల రాజకీయ పార్టీ : సునీల్

ఖైరతాబాద్, వెలుగు: నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకే నిరుద్యోగులంతా కలిసి ‘విద్యార్థుల రాజకీయ పార్టీ’ ఏర్పాటు చేసినట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వై.సునీల్ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘36 వేల మంది నిరుద్యోగులం ఏకమయ్యాం. ఏ రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగులను ఆదుకోలేదు. అందుకే మేమంతా కలిసి ఒక పార్టీని స్థాపించాం. అన్ని అసెంబ్లీ స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. 

ముందుగా 50 మందికి బీఫాం ఇస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు స్టూడెంట్స్​ను వాడుకుని వదిలేశాయి” అని సునీల్ మండిపడ్డారు. విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు కింద ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు. విద్య, వైద్యం ఫ్రీగా అందిస్తామని, 2.60 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. 70 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.