నర్సాపూర్​ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి

నర్సాపూర్​ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్, వెలుగు: నర్సాపూర్ బీఆర్ఎస్ ​అభ్యర్థిగా మహిళా కమిషన్​ చైర్ పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డి పేరును పార్టీ చీఫ్​ కేసీఆర్ ఖరారు చేశారు. బుధవారం ప్రగతి భవన్​లో ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, కేసీఆర్ చేతుల మీదుగా ఆమె  బీఫామ్​ అందుకున్నారు. మదన్​ రెడ్డికి పార్లమెంట్​ఎన్నికల్లో మెదక్​లోక్​సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వనున్నారని  బీఆర్​ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. కేసీఆర్​ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్​ కోర్​కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.  మదన్​రెడ్డి మొదటి నుంచి తనతో పాటు కొనసాగుతున్న సీనియర్​నాయకుడని, తనకు కుడిభుజం లాంటి వారని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఆలోచనను గౌరవించి నర్సాపూర్​లో సునీత గెలుపునకు కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుత మెదక్​ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడంతో ఆ స్థానం నుంచి మదన్​రెడ్డికి అవకాశం ఇస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలలుగా పెండింగ్​.. 

సిట్టింగ్​ఎమ్మెల్యే మదన్​రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య విభేదాల కారణంగా ఇక్కడ రెండు నెలలుగా నర్సాపూర్​ అభ్యర్థిని ప్రకటించలేదు. చివరికి ఇద్దరు నేతల మధ్య కేసీఆర్ సయోధ్య కుదిర్చి సునీతకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఆమెకు బీఫామ్ ​ఇవ్వడంతో ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి బీఫామ్​లు తీసుకున్నవారి సంఖ్య 110కి చేరింది. ఇంకా ఆలంపూర్, గోషామహల్​తోపాటు ఓల్డ్​సిటీలో ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తోన్న ఏడు స్థానాల్లో పోటీ చేసే క్యాండిడేట్లకు బీఫాంలు ఇవ్వాల్సి ఉంది. ఆలంపూర్​లో సిట్టింగ్​ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్​ప్రకటించినా అక్కడి పార్టీ నేతలు ఆయనను తప్పించి మరొకరికి చాన్స్​ ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల 500 మందికి పైగా నేతలు ప్రగతి భవన్​కు వచ్చి కేటీఆర్​ను కలిసి ఇదే డిమాండ్​వినిపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్య అనుచరుడు విజేయుడు పేరు కూడా అక్కడి నుంచి పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే పెండింగ్​ స్థానాలను ఫైనల్​చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.